ఏపీకి చేరుకొన్న లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్

April 17, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ రప్పించింది. అవి దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి ప్రత్యేక విమానంలో నేడు రాష్ట్రానికి చేరుకొన్నాయి. వాటితో కేవలం 10 నిమిషాలలోనే కరోనా సోకిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. ఆ టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందిన తరువాత ముందుగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పరీక్ష చేయించుకోగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాలుగైదు రోజులలో ఆ టెస్టింగ్ కిట్లను 13 జిల్లాలకు పంపిణీ చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఏపీలో ఇప్పటివరకు 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 36 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు కనుక కరోనా లక్షణాలున్నవారందరికీ దిగుమతి చేసుకొన్న ఈ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

తెలంగాణలో ఇప్పటివరకు 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 186 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18 మంది కరోనాతో చనిపోయారు.  

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇప్పటివరకు 1,767 మంది కోలుకోగా 452 మంది కరోనాకు బలైపోయారు.


Related Post