ధారావీలో భయపడినట్లే జరుగుతోంది

April 16, 2020


img

ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ధారావీలో 26 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ధారావీలో కరోనా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈరోజు ఓ వ్యక్తి మరణించడంతో ధారావీ మురికివాడలో మృతుల సంఖ్య 9కి చేరింది. 

ధారావీలో కరోనా వైరస్‌ ప్రవేశిస్తే దానిని అడ్డుకోవడం చాలా కష్టమని అందరూ ముందే ఊహించారు. ఎందుకంటే ధారావీలో ‘ఇళ్ళు’ అని పిలుచుకొనే రేకుల షెడ్లలో సుమారు 15 లక్షలకు పైగా జనాభా ఉంటున్నారు. అవన్నీ ఒకదానిపై మరొకటి ఆనుకొని ఉంటాయి. వాటి మద్య ఇరుకు సందులలో నుంచే అక్కడివారు రాకపోకలు సాగిస్తుంటారు. కనుక ధారావీలో కరోనా మహమ్మారి ప్రవేశించి తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. 

దేశంలోకెల్ల అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,919కి...మృతుల సంఖ్య 187కి చేరింది. ఈ విపత్కర పరిస్థితులలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటం పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం ధారావీలో కరోనాను కట్టడి చేయడంలో విఫలమైతే అది అణుబాంబు కంటే భయానకంగా విస్పోటనం చెందే ప్రమాదం ఉంది. ధారావీలో పరిస్థితులు అదుపుతప్పితే అంతమందికి వైద్యం చేయడం కష్టం కనుక ఒకేసారి కొన్ని వేలు..లక్షల మంది చనిపోయే పెను ప్రమాదం పొంచి ఉంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ధారవీలో కరోనా విస్పోటనం జరుగక మునుపే నివారించడం చాలా అవసరం.


Related Post