డిసెంబర్ వరకు కరోనాను భరించాల్సిందే!

April 16, 2020


img

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  కరోనా మహమ్మారి గురించి ఐక్య రాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు. “కరోనా వైరస్‌ నివారణకు ఇంకా మందు కనుగొనలేదు. కరోనా సోకకుండా నివారించే వ్యాక్సిన్ ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. కనుక అప్పటివరకు సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రపంచం మళ్ళీ సురక్షితమైన సాధారణ స్థితికి చేరుకొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కనుక డిసెంబర్ వరకు కరోనాతో పోరాడుతూనే ఉండాలి,” అని అన్నారు.  

ఆంటోనియో గుటెరస్ చెప్పిన ఈ విషయాన్ని అంగీకరించడం చాలా కష్టమే కానీ అది చేదు నిజమని చెప్పక తప్పదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ ద్వారా కరోనా కేసులు, మృతుల సంఖ్యను కట్టడి చేయవచ్చు కానీ పూర్తిగా నివారించలేమని భారత్‌తో సహా ప్రపంచదేశాలలో నానాటికీ పెరుగుతున్న కేసులు, మృతుల సంఖ్యను చూస్తే అర్ధమవుతుంది. 

ఉదాహరణకు ఒక ప్రదేశంలో కరోనా రోగిని గుర్తించి, అతనిని ఆసుపత్రికి తరలించేలోగా అతనిద్వారా మరికొంతమందికి వైరస్ వ్యాపిస్తూనే ఉంది. లాక్‌డౌన్‌తో ఆ ‘కరోనా గొలుసు’ను తెంచాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి కానీ 130 కోట్లు జనాభా ఉన్న భారత్‌లో ఇది ఎంతకష్టమైన పనో అందరికీ తెలుసు. పైగా కరోనా రోగులు ఉద్దేశ్యపూర్వకంగానే ఇళ్ళలో దాక్కొంటుండటం, వారికి సహాయం అందించేందుకు వస్తున్న ఆశా కార్యకర్తలు, అధికారులు, పోలీసులపై వారి బందుమిత్రులు దాడులు చేస్తుండటం, ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులుచేస్తుండటం, ఆసుపత్రుల నుంచి కరోనా రోగులు పారిపోతుండటం, కొన్ని చోట్ల వైద్యులు లేదా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా రిపోర్టులు రాకమునుపే కరోనా రోగులను ఇళ్లకు పంపించివేస్తుండటం వంటి అనేక ఘటనలు రోజూ మన కళ్ళముందే జరుగుతున్నాయి. 

ఇక లాక్‌డౌన్‌ నిబందనలను పట్టించుకోకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండటం, ఎక్కడికక్కడ నిలిచిపోయిన లక్షలాదిమంది వలస కార్మికుల మద్య సామాజిక దూరం పాటించే పరిస్థితులు లేకపోవడం వంటివన్నీ చూస్తుంటే ఇంకా ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్ళు లాక్‌డౌన్‌ పెట్టుకున్నా కరోనాకు అడ్డుకట్టవేయడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కనుక ఆంటోనియో గుటెరస్ చెప్పినట్లుగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే వరకు ప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడకుండా తప్పించుకొంటూ బ్రతకడం అలవరచుకోవాలి. అంటే మొసళ్ళ చెరువులో చేపల మాదిరిగా అన్నట్లన్నమాట! కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే వరకు దాని నుంచి తప్పించుకోగలిగినవారే ఈ భూమ్మీద జీవిస్తారు. మిగిలినవారు పోకతప్పదు. ఈ చేదు నిజం ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


Related Post