రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటించిన కేటీఆర్‌

April 15, 2020


img

రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ బుదవారం వేములవాడలో కరోనా రెడ్ జోన్లుగా ప్రకటించబడిన ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పి, వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావడానికి అనుమతించడం లేదు కనుక ప్రభుత్వమే వారికి నిత్యావసరవస్తువులు సరఫరా చేస్తోంది. అవి సక్రమంగా అందుతున్నాయో లేదా అని మంత్రి కేటీఆర్‌ ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. ఈ క్లిష్టసమయంలోనే అందరూ మరికాస్త సహనంగా ఉండాలని కేటీఆర్‌ వారికి ధైర్యం చెప్పారు. వారికి ఏ అవసరమున్నా సంకోచించకుండా ఆ ప్రాంతంలోని అధికారులు, సిబ్బందికి చెప్పి సహాయం పొందవచ్చని కేటీఆర్‌ చెప్పారు.  



అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమెరికావంటి అగ్రరాజ్యమే కరోనా వైరస్‌ ధాటిని తట్టుకోలేకపోతోంది. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు పేరుకుపోతున్నాయీ. అటువంటి దుస్థితి మనకి దాపురించకూడదంటే అందరూ లాక్‌డౌన్‌కు కట్టుబడి ఎవరి ఇళ్ళలో వారు ఉండాలి. సామాజిక దూరం పాటించడం, ఒకవేళ బయటకు వస్తే మాస్కూలు ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలన్నీ తప్పక పాటించాలి. 

పల్లెల్లో నివశిస్తున్న ప్రజలు కరోనా వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ పట్టణాలలో చదువుకొన్న యువత, ప్రజలే జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం ఇకనైనా పట్టణాలలో ప్రజలు లాక్‌డౌన్‌ నిబందనలకు కట్టుబడి ఇళ్ళలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవారిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోము. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటాము. 


జిల్లాలో ఇప్పటివరకు ఒకే ఒక కేసు నమోదైంది. ప్రభుత్వం కృషి, ప్రజల సహకారం వలననే జిల్లాలో కరోనాను కట్టడి చేయగలిగాము. ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు మందు కనుగొనలేదు కనుక స్వీయ నియంత్రణ విధానలే మందుగా భావించి ఇక ముందు కూడా ఇలాగే అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా మారుతుంది,” అని అన్నారు.


Related Post