ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ షాక్

April 15, 2020


img

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ షాక్ ఇచ్చారు. కరోనా విషయంలో డబ్ల్యూ.హెచ్.ఓ మొదటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున, దానికి అమెరికా అందిస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా డబ్ల్యూ.హెచ్.ఓకు భారీగా నిధులిస్తున్నప్పుడు, దాని పనితీరును ప్రశ్నించే హక్కు, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించే అధికారం అమెరికాకు ఉంటుందని ట్రంప్ అన్నారు. 

గత ఏడాది డిసెంబరులో చైనాలో కరోనా వైరస్‌ పుట్టినప్పుడు, అది అంటువ్యాది అని డబ్ల్యూ.హెచ్.ఓకి తెలిసి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని వెంటనే ప్రపంచదేశాలకు తెలియజేయకుండా అలసత్వం ప్రదర్శించిందని, తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది కరోనాబారిన పడుతున్నారని, వేలాదిమంది చనిపోతున్నారని ట్రంప్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమెరికా ఆ సమస్య తీవ్రతను గుర్తించిన వెంటనే చైనా ప్రయాణాలపై ఆంక్షలు విధించాలనే తమ ప్రతిపాదనను కూడా డబ్ల్యూ.హెచ్.ఓ పట్టించుకోలేదని, అమెరికాపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ సంస్థకు ఇంకా నిధులు ఇవ్వవలసిన అవసరం ఉందనుకోవడం లేదని అందుకే నిధులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.          

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నేరుగా చెప్పకపోయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ఒత్తిడిమేరకు కరోనా వైరస్‌ గురించి దాచిపెట్టిందని ఆరోపిస్తున్నట్లే భావించవచ్చు. అది సకాలంలో ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకపోవడం వలననే ఇంత అనర్ధం జరుగుతోందని ట్రంప్ ఆరోపణలో వాస్తవం ఉందని అందరూ అంగీకరిస్తారు. కరోనా వైరస్‌కు ప్రపంచదేశాలన్నిటి కంటే ఎక్కువగా డబ్ల్యూ.హెచ్.ఓకు నిధులిస్తున్నఅమెరికాయే కరోనాకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుండటం అమెరికన్లకు ఆగ్రహం కలిగించడం సహజమే. పైగా కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికాలో ఏర్పడిన ఈ కరోనా సంక్షోభం, ఈ అవాంఛిత పరిణామాలతో ట్రంప్ విజయావకాశాలకు గండిపడవచ్చు. కనుక ట్రంప్ ఆగ్రహం సహేతుకమేనని చెప్పవచ్చు. 


Related Post