ముంబైలో వలస కార్మికులు ఆందోళన

April 14, 2020


img

దేశవ్యాప్తంగా మళ్ళీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో బిహార్, యూపీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ముంబైలో పనిచేసుకొంటున్న వలస కార్మికులు ఈరోజు సాయంత్రం బాంద్రా వెస్ట్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. గత మూడువారాలుగా లాక్‌డౌన్‌ కారణంగా తామందరం ఉపాధి, ఆదాయం కోల్పోయామని, చేతిలో డబ్బు లేకపోవడంతో చాలామంది ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 19 రోజులు ఇలాగే బ్రతకడం చాలా కష్టమని, కనుక తమని తక్షణమే ఏదోవిధంగా స్వస్థలాలకు పంపించాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఒకేసారి సుమారు 2,000 మంది వలస కార్మికులు రోడ్లపైకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వారికి నచ్చజెప్పి వెనక్కు తిప్పి పంపించేందుకు ప్రయత్నించారు కానీ వారు తమ ఆందోళన కొనసాగించడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.  

మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడే వలస కార్మికులు నానాకష్టాలు అనుభవించారు. కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలో ఉండే తమ రాష్ట్రాలకు బయలుదేరారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించడం అదే మొదటిసారి కనుక దాని వలన ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలో తెలియక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురై ఉండవచ్చు. కనీసం రెండవసారి లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పుడైనా వారికి అవసరమైన సౌకర్యాలు లేదా ఏర్పాట్లు చేసి ఉండి ఉంటే నేడు వారు ఈవిధంగా రోడ్లపైకి వచ్చేవారుకారు కదా? ఇప్పుడు పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేసి చెదరగొడితే వారి కష్టాలు, సమస్యలు లేకుండాపోతాయా? వారి సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది.  



Related Post