ధారావిలో కరోనా విస్పోటనం కాబోతోందా?

April 14, 2020


img

ముంబైలోని ధారావి...ఆసియా కండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ. అక్కడ ఇల్లు అంటే ఓ రేకుల షెడ్. కనుక ఒకదాని పక్కన మరొకటి లక్షల షెడ్లున్నాయి. వాటిలోనే సుమారు 15-20 లక్షల మంది పేదప్రజలు, వలసకార్మికులు జీవిస్తున్నారు. అంత కిక్కిరిసిన ధారావి మురికివాడలో కరోనా వైరస్‌ ప్రవేశించడమంటే అడవిలో మంటలు అంటుకోవడమేనని చెప్పవచ్చు. 

దేశంలోకెల్ల అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి, కరోనా మృతుల సంఖ్య పెరిగిపోవడానికి బహుశః ధారావి కేసులే కారణం అయ్యుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

కానీ ధారావీలో ఉన్న 15-20 లక్షల మందిని వేరే చోటికి తరలించడం దాదాపు అసంభవం. అలాగని అంతా తక్కువ విస్తీర్ణంలో ఒకేచోట అన్ని లక్షలమంది ఉండటం ఇంకా ప్రమాదం. కనుక ధారావిలో కరోనా వ్యాప్తి చెందకుండా ఏవిధంగా అడ్డుకోవాలో తెలియక అధికారులు తల పట్టుకొంటున్నారు. వారు ఏమి చేయాలో ఆలోచిస్తుండగానే ధారావీలో ప్రతీరోజు కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ధారావీలో మంగళవారం కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా, ఇద్దరు మరణించారు. వాటితో కలిపి ఇప్పటివరకు ఒక్క ధారావీలోనే 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.

ధారావీలో ఏదోవిధంగా కరోనాను కట్టడి చేయవలసిందే కనుక ఆ ఇరుకు సందులలో పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా కాపలాకాస్తున్నారు. ధారవీకి సమీపంలో ఐసోలేషన్, క్వారంటైన్‌ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏమాత్రం కరోనా రోగలక్షణాలు కనిపించినా వెంటనే వారిని అక్కడకు తరలిస్తున్నారు. కానీ ఈవిధంగా ఎంతకాలం ధారవీలో కరోనా వ్యాపించకుండా అడ్డుకోగలమని అధికారులే ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధారావీలో కరోనా వ్యాపిస్తే అది అణుబాంబుకంటే తీవ్రంగా విస్పోటనం చెంది యావత్ భారతదేశాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. కనుక దారావీలో కనీసం సగం మందినైనా వేరే ప్రాంతాలకు తరలించడం చాలా మంచిది.


Related Post