జగన్ ఆత్రం.. మోడీ బ్రేకులు!

April 14, 2020


img

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగించేయాలని ఆతృత పడుతున్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత నెల 24న మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించక మునుపు ఎన్నికలు ముగించేద్దామనుకున్నారు. కానీ ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కరోనా కారణంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసి జగన్‌ ఆగ్రహానికి గురయ్యారు. నిమ్మగడ్డ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతలోనే ఏపీతో సహా దేశంలో కరోనా ఉదృతి పెరగడం ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. 

అయినప్పటికీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేశారు. నిమ్మగడ్డను ఆ పదవిలో నుంచి తొలగించి ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి కనగరాజ్‌ను నియమించి హడావుడిగా బాధ్యతలు అప్పగించారు. జగన్ మనసులో ఏముందో ఆయనకు అర్ధమైంది కనుక బాధ్యతలు చేపట్టగానే ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. 

ఒకపక్క రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుంటే, ఇటువంటి క్లిష్టసమయంలో కూడా జగన్ ప్రభుత్వం ఈవిధంగా రాజకీయాలు చేస్తుండటంపై ప్రతిపక్షాలు..ముఖ్యంగా టిడిపి తప్పు పట్టాయి. ఈ నిర్ణయాలపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఎన్నికలు నిర్వహించాలనుకొంటోంది?అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. 

లాక్‌డౌన్‌ అమలు విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు స్వేచ్చనిస్తుందని, ఒకవేళ ఈరోజు (ఏప్రిల్ 14) లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేసి ఆ తరువాత రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ అమలుచేయాలని జగన్ భావించి ఉండవచ్చు. కానీ జగన్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా ప్రధాని నరేంద్రమోడీ మే 3వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్దంగా ఉన్నప్పటికీ మే 3వరకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. బహుశః ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు లాక్‌డౌన్‌ పొడిగింపుపై తీవ్ర నిరాశ చెందిఉండవచ్చు. 

వివిద రాష్ట్రాలలో వివిద ప్రాంతాలలో కరోనా తీవ్రతను బట్టి వీలైతే ఏప్రిల్ 20 నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు కనుక అప్పటి వరకు వైసీపీ నేతలు వేచి చూడక తప్పదు. కానీ అప్పటిలోగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేయడానికి కూడా వీలుకుదరదు  కనుక ఆలోగా కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. 


Related Post