చివరికి అదే జరుగబోతోందా?

April 13, 2020


img

కరోనా వైరస్‌ను కట్టడి చేయాలనే ప్రయత్నంలో ఇప్పటి వరకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లక్షణాలు కనబడినవారందరికీ రూ.3-4000 ఖరీదు చేసే కరోనా వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నాయి. సామాన్యులెవరికీ అందుబాటులో లేని కరోనా వైద్య చికిత్సలను పూర్తి ఉచితంగా అందజేస్తున్నాయి. కానీ నేటికీ చాలామంది వైద్య పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తమకు సహాయం చేయడానికి వస్తున్న ఆశావర్కర్లు, పోలీసులు, ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఎదురుదాడులు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇంకా అదుపులో ఉంది కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లక్షణాలు కనబడినవారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు చేయిస్తున్నాయి. కానీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతే అప్పుడు అందరికీ ఈవిధంగా ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించలేని నిసహాయత ఏర్పడుతుందని వేరే చెప్పక్కరలేదు. అప్పుడు ఆశావర్కర్ల, అధికారుల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా ప్రయోజనం ఉండదు.   

దేశంలో... రాష్ట్రంలో ఇంకా అటువంటి పరిస్థితులు ఏర్పడలేదు కానీ ఇటీవల కరోనా పరీక్షల విషయమై దాఖలైన ఒక పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన విషయం విన్నట్లయితే రానున్న రోజులలో కరోనా పరీక్షలు, చికిత్సలు ఉచితంగా లభించకపోవచ్చునని అర్ధం అవుతోంది. 

ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహింపజేయాలనే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేవలం పేదలకు, ఆయుష్మాన్ భారతి లేదా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన అర్హులైన వారికి మాత్రమే ప్రైవేట్ ల్యాబ్‌లలో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించడం సమంజసంగా ఉంటుందని దీనిపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

కనుక కరోనా సోకినా ఇంకా ఎవరైనా ఇళ్ళలో దాకొన్నట్లయితే తక్షణమే బయటకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకొని ప్రాణాలు కాపాడుకోవడం చాలా మంచిది.


Related Post