కరోనా కట్టడికి మూడు జోన్లు ఏర్పాటు?

April 13, 2020


img

ఏప్రిల్ 15 నుంచి మళ్ళీ రెండువారాలు లాక్‌డౌన్‌ కొనసాగించడం దాదాపు ఖాయం అయ్యింది. కానీ వచ్చే రెండు వారాలలోపుగానే దేశంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయవలసి ఉంటుంది. ఆ తరువాత లాక్‌డౌన్‌ పొడిగించడం కష్టమే... కరోనా విజృంభిస్తే కట్టడి చేయడం కూడా కష్టమే. కనుక రాబోయే రెండు వారాల లాక్‌డౌన్‌ దేశానికి అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. అయితే కేవలం లాక్‌డౌన్‌ చేయడం వలననే కరోనాను పూర్తిగా కట్టడి చేయలేమని ఇప్పటికే స్పష్టమయింది కనుక ఈసారి కేంద్రప్రభుత్వం సరికొత్త వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. 

దేశంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. 

రెడ్ జోన్: 15 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు అయిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు . ఆ ప్రాంతాలలో ఈసారి నూటికి నూరుశాతం లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేయనున్నారు. అక్కడ నివశిస్తున్న ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు అనుమతించరు. బయటి ప్రాంతాల వారిని ఆ రెడ్ జోన్‌లోకి అనుమతించరు. రెడ్ జోన్‌లో ఉన్న ప్రజలందరికీ ప్రతీ రెండు రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రెడ్ జోన్‌ ప్రాంతాలలో మరింత శుభ్రత, క్రిమిసంహారక మందుల పిచ్చికారి చేయడంవంటివి చేస్తుంటారు.  

ఆరెంజ్ జోన్: 15 కంటే తక్కువ కేసులు నమోదు అయిన ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ ప్రాంతాలలో కొన్ని ఆంక్షలతో ప్రజల రాకపోకలకు, పరిమిత కార్యక్రమాలకు అనుమతిస్తారు. 

గ్రీన్ జోన్: నేటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ ప్రాంతాలను గ్రీన్‌ జోన్‌గా పరిగణించి పాక్షిక లాక్‌డౌన్‌ పాటిస్తారు. గ్రీన్‌ జోన్‌లో ప్రజలు ఆ జోన్ పరిధి దాటకుండా స్వేచ్ఛగా తమ దైనందిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు అనుమతించవచ్చని సమాచారం. ప్రజారవాణాను కూడా అనుమతించే అవకాశం ఉంది. ఈ గ్రీన్ జోన్‌ పరిధిలో ఉండే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను కొన్ని ఆంక్షలు, మార్గదర్శకాలకు లోబడి పనిచేసుకొనేందుకు అనుమతించవచ్చు. దేశంలో ఒక్క కేసు కూడా సోకని జిల్లాలు 430 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 

ఒకవేళ పాక్షిక లాక్‌డౌన్‌ అమలుచేయదలిస్తే, వ్యవసాయం, నిత్యావసర సరుకుల ఉత్పత్తి, రవాణా, వాహన తదితర రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో అన్ని సందేహాలకు సమాధానాలు లభించవచ్చు కనుక అంతవరకు వేచి చూడాల్సిందే. 


Related Post