ఏపీ, తెలంగాణలలో పెరుగుతున్న కరోనా కేసులు

April 13, 2020


img

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎంత కటినంగా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. రోజూ  కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

ఏపీలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 427కి చేరింది. ఏపీలో అత్యధికంగా గుంటూరులో ఇప్పటివరకు 89, కర్నూలులో 84 కేసులు నమోదు కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయారు. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 531, చనిపోయినవారి సంఖ్య 16కి చేరింది. ఆదివారం ఏడుగురు వ్యక్తులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్ అయ్యారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 103 మంది కరోనా నుంచి విముక్తులైనట్లయింది. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు అవుతుడంటం గమనిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఇంకా కటిన చర్యలు తీసుకోవలసి ఉందని సిఎం కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డిల్లీ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు రాష్ట్రంలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యపరీక్షలు జరిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కావాలని లేకుంటే కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృదా అవుతాయన్నారు. ఇకపై లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కటినంగా అమలుచేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


 


Related Post