కరోనా అనేక కొత్త పాఠాలు నేర్పింది: కేటీఆర్‌

April 11, 2020


img

తెలంగాణ మునిసిపల్, ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాత్రి ‘ఆస్క్ కేటీఆర్‌’ హ్యాష్ ట్యాగుతో ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆస్క్ కేటీఆర్‌ కార్యక్రమం సారాంశం: 

కరోనా వైరస్‌ భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నిటికీ అనేక కొత్త పాఠాలు నేర్పించింది. ముఖ్యంగా అగ్రరాజ్యాలకు కూడా కొత్త పాఠాలు నేర్పించింది. 

కరోనాతో భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలు పునరావృతమైతే దానికి ఏవిధంగా సన్నదం కావాలో...ఏవిధంగా ఎదుర్కోవాలో అందరికీ ఇప్పుడు బాగా తెలిసివచ్చింది.   

కరోనా వలన యావత్ ప్రపంచదేశాలు ఇప్పుడు చాలా తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ, కరోనా నుంచి బయటపడిన తరువాత అన్ని దేశాలు ‘లైఫ్ సైన్సస్’ కు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ఐ‌టి రంగం తరువాత ‘లైఫ్ సైన్సస్’ ఆ స్థాయిలో ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు కల్పించబోతోంది. వైద్య రంగం, వైద్య పరికరాల తయారీ, వైద్య వసతుల కల్పన తదితర రంగాలలో పెనుమార్పులు రాబోతున్నాయని నేను భావిస్తున్నాను. 

కరోనాతో భారతీయులందరికీ క్రమశిక్షణ అలవడింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత బాగా పెరిగింది. ఇక ముందు కూడా దీనిని ఇలాగే కొనసాగించాలని కోరుకొంటున్నాను. 

కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్ల పట్ల ఇప్పుడు ప్రజలలో చాలా గౌరవభావం ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగాలని నేను కోరుకొంటున్నాను. మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఎంతో సమర్ధంగా..అంకితభావంతో పనిచేస్తున్నాయి. కరోనా తరువాత వారు కూడా ఇదే అంకితభావంతో పనిచేయాలని కోరుకొంటున్నాను.   

లాక్‌డౌన్‌ వలన ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గింది. తత్ఫలితంగా భూతాపం గణనీయంగా తగ్గింది. మానవాళి వలన దెబ్బతిన్న ప్రకృతి మళ్ళీ మెల్లగా చక్కబడుతోంది. కనుక వీలైతే ఇకపై ప్రతీ ఏడాది కూడా ప్రపంచదేశాలన్నీ 10 రోజులు లాక్‌డౌన్‌ పాటిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల వలన రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతున్నాము. కరోనా వ్యాధి నివారణకు ప్రపంచదేశాలలో ఎక్కడ అత్యుత్తమైన వైద్యవిధానం అవలంభిస్తున్నా దానిని తెలంగాణలో కూడా అమలుచేసి మళ్ళీ కరోనా పునరావృతం కాకుండా చేస్తాము. 


Related Post