ఓ పక్క కరోనా...మరోపక్క ఉగ్రవాదులు

April 11, 2020


img

కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న పాకిస్థాన్‌ దాని నుంచి బయటపడలేక ప్రపంచదేశాల సాయం ఆర్ధిస్తోంది. ఇటువంటి క్లిష్టసమయంలో కూడా పాక్‌ వక్రబుద్ది మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం భారత్‌ కూడా కరోనా పోరాటంలో నిమగ్నమై ఉన్నందున ఇదే అదునుగా ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపించడానికి ప్రయత్నించింది. కానీ భారత్‌ భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండటంతో ఎదురుదెబ్బ తగిలింది. 

ఉత్తర కశ్మీర్‌లోని కేరన్ సెక్టర్‌లో పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు భద్రతాదళాలు వారిని అడ్డుకొన్నాయి. భద్రతాదళాల చేతిలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ ఎదురుకాల్పులలో ఐదుగురు భారత్‌ జవాన్లు కూడా చనిపోయారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన భద్రతాదళాలు ఈసారి మహాశక్తివంతమైన బోఫర్స్ శతఘ్నులతో సరిహద్దులకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భీకరదాడులు చేశాయి. ఆ దాడిలో ఒక రహస్య శిబిరంలో దాగిన పలువురు ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భద్రతాదళాలు ఈ స్థాయిలో దాడులు చేయలేదు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే కాక ఆ దాడిని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి మీడియాకు విడుదల చేసింది. 

ఇకనైనా పాకిస్తాన్ బుద్దిగా మసులుకోవాలని కాదని మళ్ళీ ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టాలని ప్రయత్నించినా, సరిహద్దు భద్రతాదళాలపై దాడులు చేసినా ఈసారి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి మరీ బుద్ది చెపుతామని భారత్‌ ఆర్మీ పాకిస్థాన్‌ను హెచ్చరించింది.


Related Post