పంజాబ్‌లో మే 1వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

April 10, 2020


img

పంజాబ్‌లో మే 1వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ అధ్యక్షతన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రులందరూ ఏకగ్రీవంగా లాక్‌డౌన్‌ పొడిగింపుకు ఆమోదం తెలిపారు. వెంటనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొదిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ సందర్భంగా సిఎం అమరీందర్ సింగ్‌ చంఢీఘడ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కరోనాను ఇప్పుడు అరికట్టలేకపోతే ఇంకెప్పుడూ అరికట్టలేము. ఎందుకంటే పీజీఐఎమ్ఈఆర్ అధ్య‌య‌నం ప్ర‌కారం ఒకవేళ ఇప్పుడు కరోనా వైరస్‌ను కట్టడిచేయలేకపోతే ఆ తరువాత దేశవ్యాప్తంగా 58 శాతం ప్రజలకు, రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. కనుక ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ లాక్‌డౌన్‌ పొడిగించి కరోనా వైరస్‌ను కట్టడి చేయకతప్పదు. కనుక కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ పంట చేతికి వస్తుంది కనుక లాక్‌డౌన్‌ సమయంలో పంటలకోతకు అనుమతిస్తాము,” అని అన్నారు. 

ఒడిశా ప్రభుత్వం మార్చి 30వరకు లాక్‌డౌన్‌ పొదిగిస్తూ నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం ఇంకా నిర్ణయం ప్రకటించక మునుపే ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌ పొడిగిస్తుండటం పరిస్తితి తీవ్రతకు అద్ధం పడుతోందని భావించవచ్చు.


Related Post