రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రి ఈటల ప్రెస్‌మీట్‌

April 09, 2020


img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలవలన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుదవారం 49 కేసులు నమోదు కాగా ఈరోజు కొత్తగా 18 కేసులే నమోదు అయ్యాయి. ఈరోజు నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో నేటివరకు మొత్తం 471 కేసులు నమోదుకాగా వారిలో 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రేపు మరో 60-70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 12 మంది మాత్రమే కరోనాతో చనిపోయారు. 

నిజానికి డిల్లీ మర్కజ్‌ కేసులు లేకపోయుంటే ఈపాటికి రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడి ఉండేది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా స్పందించి అక్కడికి వెల్లివచ్చినవారినందరినీ గుర్తించి, పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ శిబిరాలకు, అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితుళు అదుపులోకి వచ్చాయి. లేకుంటే వందల సంఖ్యలో పెరిగిపోయుండేవి. ప్రస్తుతం గాంధీ, కింగ్ కోఠీ, ఛాతీ ఆసుపత్రులలో మొత్తం 414 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది ఈనెల 22వ తేదీకి పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. కనుక ఈనెలాఖరులోగా రాష్ట్రంలో కరోనా సమస్య నుంచి బయటపడే అవకాశాలున్నాయి,” అని చెప్పారు. 


Related Post