నిన్న ప్రతీకారం..నేడు కృతజ్ఞతలు!

April 09, 2020


img

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో దేశాన్ని... ప్రజలను కాపాడుకోవడం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ను ‘హైడ్రాక్సీక్లోరోక్విన్‌’ మాత్రలతో కట్టడి చేయవచ్చునని తెలుసుకొన్న ట్రంప్, వాటిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న భారత్‌ సాయం కోరారు. అయితే కోట్లాదిమంది జనాభా ఉన్న      భారత్‌లో కూడా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో ప్రధాని మోడీ డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇవ్వలేదు. వీలైనంతవరకు సాయం చేస్తామని మాట ఇచ్చారు. 

కానీ అమెరికాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తుండటంతో తీవ్ర ఆందోళనతో ఉన్న ట్రంప్ యధాప్రకారం ఆవేశంలో నోరుజారారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేయకపోతే భవిష్యత్‌లో ప్రతీకార చర్యలు తీసుకొంటామని భారత్‌ను బెదిరించారు. అయితే అమెరికా పరిస్థితులను, ట్రంప్ ఆవేశాన్ని దాని వెనుకున్న ఆవేదనను అర్ధం చేసుకొన్న ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు 29 మిలియన్‌ డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను అమెరికాకు పంపించారు. 

అందుకు ఉప్పొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్‌ వెంటనే చల్లబడిపోయి “ఈ అసాధారణ సమయమయాలలో స్నేహితుల మద్య మరింత పరస్పరసహకారం చాలా అవసరం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను అందజేస్తున్నందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు. మీ మేలు ఎన్నటికీ మరిచిపోము. కరోనాపై జరుగుతున్న ఈ యుద్ధంలో మీ బలమైన నాయకత్వంలో ఒక్క భారత్‌నే కాక యావత్ మానవాళికి మీరు సహాయపడుతున్నారు. థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ,” అని ట్వీట్ చేశారు.

ట్రంప్ ట్వీట్‌కు ప్రధాని నరేంద్రమోడీ సమాధానంగా, “మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌! ఇటువంటి క్లిష్టసమయంలోనే మిత్రులు ఒకరికొకరు మరింత చేరువవుతారు. భారత్‌-అమెరికా బందం మరింత బలపడింది. కోవిడ్-19 మహమ్మారిపై మానవాళి చేస్తున్న ఈ పోరాటంలో భారత్‌ చేయగలిగినంత సాయం తప్పక చేస్తుంది. కలిసి చేస్తున్న ఈ పోరాటంలో మనం తప్పక విజయం సాధిస్తాము,” అని ట్వీట్ చేశారు. 


ట్రంప్ ఆవేశంలో నోటిదురుసు ప్రదర్శించినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ సంయమనంగా కోల్పోకుండా చాలా హుందాగా వ్యవహరిస్తూ ఈ క్లిష్టసమయంలో అమెరికాకు అవసరమైన సాయం చేయడం వలన మళ్ళీ ట్రంప్ చేత ప్రశంశలు అందుకోవడమే కాక అమెరికా దృష్టిలో భారత్‌ గౌరవప్రతిష్టలు మరింత పెరిగేలా చేశారని చెప్పవచ్చు.   

 హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల సరఫరా చేయాలని బ్రెజిల్ దేశం చేసిన అభ్యర్ధన పట్ల కూడా ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించి అవసరమైనన్ని మాత్రలను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ దేశాధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో కూడా ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 


Related Post