మే 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు?

April 08, 2020


img

దేశ ఆర్ధిక పరిస్థితులను ఇంకా అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాలలో పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ డిల్లీ మర్కజ్ సమావేశాల తరువాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతుండటంతో, మరికొన్ని వారాలు లాక్‌డౌన్‌ కొనసాగించాలని సిఎం కేసీఆర్‌తో సహా పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, జిల్లాల కలక్టర్లు, ఐఏస్‌ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ అధికారులు, మేధావులు, వివిద రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు సూచిస్తుండటంతో మే15 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. నిన్న డిల్లీలో సమావేశమైన కేంద్రమంత్రులతో కూడిన ‘మంత్రుల బృందం’ (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఇదే అంశంపై సుదీర్గంగా చర్చించింది. పలు రాష్ట్రాల నుంచి వస్తున్న సూచనలు, సలహాలపై కూడా వారు లోతుగా చర్చించారు.

ముఖ్యంగా అన్ని విద్యాసంస్థలు, అన్ని మతాల ప్రార్ధనామందిరాలను, ఇంకా ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న సంస్థలను మే 15వరకు మూసేవేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు పార్లమెంటులో వివిదపార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకొన్నాక దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నెల 14తో మూడు వారాల లాక్‌డౌన్‌ ముగుస్తుంది కనుక ఏప్రిల్ 11 లేదా 12వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించినప్పుడు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించవచ్చని తాజా సమాచారం.

అయితే ఇదేవిధంగా 100 శాతం లాక్‌డౌన్‌ అమలుచేయడం వలన రానున్న రోజులలో దేశంలో ఆర్ధికసంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంటుంది కనుక కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొంటూ జనాలు తక్కువగా ఉండే సంస్థలపై, సేవలపై పరిమిత ఆంక్షలతో మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.               



Related Post