కరోనా రోగులు దాగుడుమూతలు ఆడితే...

April 03, 2020


img

దేశంలో లాక్‌డౌన్‌ అమలుచేసిన తరువాత కరోనా వైరస్‌ నియంత్రణలోకి వస్తోందనుకొంటున్న సమయంలో నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రాలకు తిరిగి వచ్చినవారి ద్వారా కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతుండటంతో గత 2-3 రోజులలోనే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరగడం ప్రారంభమైంది. కనుక నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, తమ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ నేటికీ చాలా మంది బయటకు రావడం లేదు. 

కొన్ని రాష్ట్రాలలో పోలీసులు, ప్రజారోగ్య సిబ్బంది అటువంటి వారిని గుర్తించి వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయనిరాకరణ చేస్తున్నారు. కొన్ని చోట్ల సిబ్బందిపై వారు మూకుమ్మడిగా ఎదురుదాడులు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి ప్రాణాలను కాపాడేందుకు వచ్చినవారిపైనే దాడులు చేస్తుండటం చాలా శోచనీయం. 

పైగా అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా వ్యాధి సోకినవారు ఆ విషయం దాచిపెట్టినా లేదా ఇతరులకు సంక్రమింపజేసినా దానిని తీవ్ర నేరంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నా వారు ముందుకు రాకపోవడం ప్రభుత్వాదేశాలను ధిక్కరించడంగానే పరిగణించవలసి ఉంటుంది. 

ఈ వాదోపవాదాలు, పరస్పర ఆరోపణలను పక్కన పెట్టి నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రాలకు తిరిగివచ్చి రహస్యంగా జీవిస్తున్నవారందరూ ఒక విషయం గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది. వారు ప్రజారోగ్య సిబ్బందికి చిక్కకుండా ఇళ్ళలో దాక్కొనట్లయితే, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనాకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. పైగా చుట్టుపక్కల వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కనుక ఇప్పటికైనా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేసి వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే ఉచితంగా కరోనా చికిత్స పొందడం మంచిది.

ఇంతకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్రాలలో ఇంకా పదుల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లక్షణాలు కనబడినవారికి రూ.3-4,000 ఖరీదు చేసే కరోనా పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నాయి. రాష్ట్రాలకు ఆర్ధికంగా చాలా భారం అయినప్పటికీ ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సామాన్యులెవరూ భరించలేనంత ఖరీదైన కరోనా చికిత్సలను, వైద్య సౌకర్యాలను ప్రభుత్వాలు పూర్తి ఉచితంగా అందజేస్తున్నాయి. కానీ ఒకసారి కరోనా అదుపు తప్పితే అప్పుడు కరోనా సోకినవారు స్వయంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయమని ప్రాధేయపడినా చేయలేని పరిస్థితి రావచ్చు. కరోనాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కాపాడేవారుండరు. ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనా సోకిన ప్రజలు ఇటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు.  కనుక అటువంటి దుస్థితి దాపురించకమునుపే కరోనా లక్షణాలున్నవారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం మంచిది.


Related Post