దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత?

April 03, 2020


img

ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడినప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేత గురించి ఏమి చెపుతారా...అని అందరూ చాలా ఆత్రంగా ఎదురుచూశారు కానీ ఆయన ఆ ప్రస్తావనే చేయలేదు. అయితే గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైనప్పుడు, ఏప్రిల్ 14న లాక్‌డౌన్‌ గడువు ముగిసిన తరువాత ఏవిధంగా వ్యవహరించాలి?అనే అంశంపై లోతుగా చర్చించి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. లాక్‌డౌన్‌ ఇంకా ఎక్కువ కాలం కొనసాగించడం కష్టం కనుక దశలవారీగా ఎత్తివేయాలని పలువురు ముఖ్యమంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. 

కానీ డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చినవారి ద్వారా దేశంలో మళ్ళీ కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్నందున, లాక్‌డౌన్‌ ముగిసేనాటికి రాష్ట్రాలలో కరోనా పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలనుకొంటే, అప్పుడు ఎటువంటి విధానాలు అనుసరించాలి? కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఎటువంటి ఆంక్షలు, పరిమితులు విధించాలి? అనే అంశాలపై ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా విధివిధానాలు రూపొందించుకొని తెలియజేయాలని ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలు రూపొందించుకొనే ఈ తాజా విధివిధానాలు, మార్గదర్శకాలను పరిశీలించిన తరువాత తదనుగుణంగా కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. 

కానీ దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి ఇప్పుడు చాలా పెరిగిపోయినందున లాక్‌డౌన్‌ ఎత్తివేయడం దుస్సాహసమే అని చెప్పవచ్చు. దేశంలో కరోనా మహమ్మారి ఒకసారి అదుపు తప్పితే భారత్‌ పరిస్థితి అమెరికా, ఇరాన్, స్వీడన్ దేశాలకంటే దయనీయంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ ఇప్పటిలాగే చాలా కటినమైన ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే ప్రజలను బయటకు అనుమతించవలసి ఉంటుంది. త్వరలోనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిర్ధిష్టమైన ప్రకటన చేస్తాయి కనుక అంతవరకు అందరూ ఎదురుచూడక తప్పదు.


Related Post