అమెరికాలో 2.40 లక్షలమంది చనిపోవచ్చు: ట్రంప్

April 01, 2020


img

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి చావు దెబ్బ తీస్తోంది. కరోనా బారినపడి అమెరికాలో సుమారు 2.40 లక్షల మంది చనిపోవచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా చెప్పడం విశేషం. రానున్న 30 రోజులు అమెరికాకు చాలా గడ్డుకాలమని కనుక దేశప్రజలందరూ ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. 

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌసులో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ బృందంలో కో-ఆర్డినేటరుగా వ్యవహరిస్తున్న డాక్టర్  డెబోరహ్ లీహ్ బిర్క్ ఈ ప్రకటన చేసిన మర్నాడే డొనాల్డ్ ట్రంప్ కూడా దానిని దృవీకరిస్తున్నట్లు మాట్లాడటం విశేషం. కరోనా విలయతాండవాన్ని చూస్తున్న అమెరికా ప్రజలు ఇప్పుడు ట్రంప్ చెపుతున్న ఈ మాటలను విని తీవ్రఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిపోకపోవడంతో 1,88,578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 4,054 మంది కరోనా బారినపడి మృతి చెందారుఅమెరికాలో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 75, 983 కేసులు నమోదు అయ్యాయంటే కరోనా తీవ్రతను ఊహించుకోవచ్చు. వాషింగ్‌టన్‌, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, టెక్సాస్ తదితర రాష్ట్రాలలో కూడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా వలన జరుగబోయే ప్రాణనష్టం ఒకపక్క తీవ్ర ఆందోళన కలిగిస్తుంటే, మరోపక్క ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా దేశం ఆర్ధికమాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుందని ఆర్ధికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 

చైనాలో కరోనా మహమ్మారి ప్రతాపాన్ని కళ్లార చూసిన తరువాత కూడా డొనాల్డ్ ట్రంప్ కరోనాను తక్కువగా అంచనావేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలననే అమెరికాకు నేడు ఈ దుస్థితి పట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మరొక నెలరోజులలోగా ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో కరోనాను అరికట్టలేకపోతే ఆయన చెప్పినట్లుగానే రెండున్నర లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. అదే కనుక జరిగితే ప్రజలు మళ్ళీ ఆయనను అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నుకోకపోవచ్చు. అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యక్తిగతంగా నష్టపోయే అవకాశముందన్న మాట! మరి ఈ కరోనా భూతాన్ని ట్రంప్ ప్రభుత్వం తరిమికొట్టగలదో లేదో?


Related Post