ప్రపంచదేశాలను విస్మయపరుస్తున్న భారత్‌

March 31, 2020


img

భారత్‌ అంటే క్రమశిక్షణారాహిత్యం...అపరిశుభ్రత...లంచగొండితనం...పేదరికం... నిరక్షరాస్యత...అంటూ వ్యాఖ్యలు చేసే విదేశీయులు ఇన్ని అవలక్షణాలతో ఉన్న భారత్‌ కరోనాను ఎదుర్కొలేదేమోనని మొదట్లో అనుమానాలు వ్యక్తం చేశారు కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు...130 కోట్లమంది ప్రజలు కలిసికట్టుగా కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరు చూసి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. 

సాధారణంగా నిర్ణయాలను తీసుకోవడానికి, వాటిని ఆచరణలో పెట్టాడానికి చాలా సమయం తీసుకొనే కేంద్రప్రభుత్వం కేవలం గంటల వ్యవధిలోనే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించడం యావత్ దేశప్రజలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలను తూచాతప్పకుండా శిరసావహించి విజయవంతంగా అమలుచేయడం, ఆ తరువాత వెంటనే దేశంలో అన్ని వ్యవస్థలను మూసివేయాలనే మరింత కటిన నిర్ణయం తీసుకొని దానిని నిఖచ్చిగా అమలుచేయడం చూసి విదేశీయులు ముఖ్యంగా యూరోపియన్లు ఆశ్చర్యపోతున్నారు. 130 కోట్లమంది ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదేశాలను గౌరవించి రోజుల తరబడి ఇళ్ళకే పరిమితమవడం చూసి భారతీయుల క్రమశిక్షణను, వారి విచక్షణా జ్ఞానాన్ని తక్కువ అంచనా వేశామని విదేశీయులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.

అమెరికావంటి అగ్రరాజ్యం కరోనాను కట్టడిచేయలేక ఆపసోపాలు పడుతుంటే, ఎవరూ చెప్పకమునుపే గ్రామాలలో ప్రజలు కంచెలు ఏర్పాటుచేసుకొని సామాజిక దూరం పాటిస్తుండటం, నిత్యావసరవస్తువులు కొనుగోలుకు వెళ్లినప్పుడు రెండు మీటర్లకు ఒకటి చొప్పున సుద్దముక్కతో హద్దులు గీసుకొని దూరం పాటిస్తుండటం, లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవారి నుదుతపై, చేతులపై పోలీసులు ముద్రలు వేస్తుండటం వంటి చిన్న చిన్న ఉపాయాలను చూసి విదేశీయులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 

ముఖ్యంగా లాక్‌డౌన్‌ ప్రకటించగానే అగ్రరాజ్యాలలో కొన్ని చోట్ల ప్రజలు షాపింగ్ మాల్స్ లో జొరబడి దోపిడీలకు పాల్పడ్డారు. కానీ భారత్‌లో అందుకు భిన్నంగా ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమకు లభించిన నిత్యావసర వస్తువులను కొని తీసుకువెళుతుండటం కూడా విదేశీయులను ఆశ్చర్యపరుస్తోంది. .      

కరోనా వైరస్‌ తీవ్రతను గుర్తించి యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా వేలాది క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసుకోవడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం క్వారంటైన్ సౌకర్యం కల్పించడం కోసం రోజుల వ్యవధిలోనే వందలాది రైల్వే బోగీలను క్వారంటైన్‌ బోగీలుగా మార్చడం వంటి విన్నూత్నమైన ఆలోచనలను, కేవలం వారాల వ్యవధిలోనే కరోనా టెస్టింగ్ కిట్స్ (మై లాబ్స్), వెంటిలేటర్లు (మహీంద్రా)దేశీయంగా రూపొందించుకోవడం వంటివి భారతీయుల మేధాశక్తికి జోహార్లు పలుకుతున్నారు. 

కరోనా నివారణ కోసం గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయివరకు వైద్య సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తుండటం విదేశీయులను ఆశ్చర్యపోతున్నారు.             

ఇక పరమపిసినార్లని ముద్రపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు కరోనా నివారణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల రూపాయాలు విరాళాలు అందిస్తుండటం, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందికి అవసరమైన రక్షణ దుస్తులు, పరికరాలు అందజేస్తుండటం విదేశీయులను అబ్బురపరుస్తోంది. 

భారత్‌ సందర్శించడానికి వచ్చే విదేశీయులు తరచూ చెప్పే మాట “ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా” (కేవలం భారత్‌లో మాత్రమే ఇవన్నీ(అవలక్షణాలు) జరుగుతాయి) అనే మాటనే మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. అయితే ఈసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ! 


Related Post