తబ్లీగీ నిర్వాహకులపై కేసులు నమోదు

July 20, 2019


img

దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడు దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాదిమందితో దక్షిణడిల్లీలో నిజాముద్దీన్ వద్దగల ‘తబ్లిగి ఏ జమాత్‌'లో మత సమావేశాలు నిర్వహించినందుకు, దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించడానికి కారకులైన నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ పోలీసులను ఆదేశించారు. ఇప్పటికీ తబ్లిగీలో ఉన్న 1400 మందిని డిల్లీ ప్రభుత్వం క్వారంటైన్‌ శిబిరాలకు తరలించింది. వైద్యఆరోగ్య సిబ్బంది ఆ ప్రాంతమంతా డ్రోన్లతో కీటకనాశిని మందులను పిచ్చికారీ చేస్తున్నారు. డిల్లీ పోలీసులు, వైద్యఆరోగ్య సిబ్బంది కలిసి నిజాముద్దీన్ పట్టణం అంతా సీల్ చేసి కరోనా రోగుల కోసం జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా తబ్లిగి పరిసరప్రాంతాలలో ప్రతీ ఇంటికి వెళ్ళి కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి క్వారంటైన్‌ శిబిరాలకు తరలిస్తున్నారు. 

మార్చి 12 నుంచి 15వరకు మూడు రోజులపాటు సాగిన ఈ మతసమావేశాలకు కరోనా ప్రభావిత దేశాలైన చైనా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యూకె, శ్రీలంక, కిర్గిజిస్తాన్ తదితర దేశాల నుంచి వందలాదిమంది హాజరైనట్లు తెలుస్తోంది. వారందరూ లాక్‌డౌన్‌ ప్రకటించకమునుపే డిల్లీ చేరుకకోవడంతో విమానాశ్రయంలో వారిని పెద్దగా పరీక్షించకుండానే అనుమతించినట్లు తెలుస్తోంది. వారిద్వారానే ఆ మతసమావేశాలకు హాజరైనవారికీ కరోనా వైరస్‌ సోకినట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి.        

దేశంలో పలురాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో నిజాముద్దీన్‌లో జరిగిన ‘తబ్లిగి ఏ జమాత్‌' సమావేశాలకు హాజరైనట్లు తెలియడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉలిక్కిపడ్డాయి. వారికి కరోనా సోకడమేకాక వారిద్వారా ఇతరులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది కనుక అన్ని రాష్ట్రాలు ఆ సమావేశాలకు హాజరైవచ్చినవారికోసం గాలింపు మొదలుపెట్టాయి. వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ మతసమావేశాలకు హాజరైన వారు లేదా కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిని చూసినట్లయితే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

లాక్‌డౌన్‌తో దేశ ఆర్ధికవ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ కరోనా గొలుసును తెంచివేయాలనే పట్టుదలతో దేశమంతటా లాక్‌డౌన్‌ పాటిస్తుంటే, ఒకే ఒక మత సమావేశంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లయింది. లాక్‌డౌన్‌ వలన ఇప్పటివరకు రోజుకు కేవలం పదుల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కానీ ఈ మతసమావేశంలో పాల్గొన్నవారివలన ఇకపై ఆ సంఖ్య బారీగా పెరుగుతుందని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.


Related Post