కరోనాతో ముంచుకొస్తున్న ఆర్ధికమాంద్యం

March 30, 2020


img

కరోనా వైరస్‌తో వచ్చే ఆరోగ్యసమస్యలన్నీ ఒక ఎత్తైతే, కరోనా వ్యాపించకుండా లాక్‌డౌన్‌ చేసుకోవడం వలన వచ్చే ఆర్ధికమాంద్యం మరో అతిపెద్ద సమస్య కాబోతోంది. “రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు మూసుకోవడం వలన ప్రభుత్వానికి రావలసిన రూ.12,000 కోట్లు ఆదాయం పోయింది. దాంతో ప్రభుత్వం చేతిలో డబ్బే లేదు. ఈ పరిస్థితులలో ప్రజాప్రతినిధులందరికీ జీతాలు నిలిపివేయక తప్పేలా లేదు. ప్రభుత్వోద్యోగులకు జీతాలలో కోత విధించవలసివస్తుందేమో?” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

ఇది కేవలం ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదాయం నిలిచిపోయింది. రాష్ట్రాల ఆదాయం కోల్పోయాయి కనుక కేంద్రం తప్పకుండా ఆదుకొంటుందని ఆశపడటం అత్యాశే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాల నుంచే పన్నుల రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూరుతుంటుంది. కనుక రోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రం వద్ద మిగిలిన నగదు నిలువలు కరిగిపోతాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కేంద్రంపైనే పూర్తిగా ఆధారపడటంతో ఆ నగదు నిలువలు ఇంకా వేగంగా కరిగిపోతుంటాయి. కనుక వీలైనంత త్వరగా దేశం కరోనా నుంచి బయటపడవలసి ఉంటుంది. 

ఏప్రిల్ 7వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి బయటపడగలదని సిఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో రాష్ట్రం ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడితే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు మళ్ళీ అన్ని వ్యవస్థలు యధాప్రకారం పనిచేయడం మొదలుపెడితే దేశం ఆర్ధికమాంద్యం బారి నుంచి తప్పించుకోగలదు. 


Related Post