మీడియాపై మంత్రి ఈటల ఆగ్రహం

March 28, 2020


img

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 5 ప్రాంతాలను కరోనా రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించిందంటూ కొన్ని మీడియా ఛానల్స్‌లో తప్పుడు వార్తలు ప్రసారం చేయడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించలేదని కనుక మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మవద్దని ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

గచ్చిబౌలిలో ఏర్పాటయిన క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ, “ఇటువంటి క్లిష్టసమయంలో మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలి తప్ప ఇటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలలో భయాందోళనలను పెంచడం సరికాదు. న్యూస్ పేపర్లను తాకితే కరోనా వైరస్‌ సోకుతుందని పుకార్లు పుట్టినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెంటనే దానిని ఖండించవలసి వచ్చింది. తప్పుడు వార్తలను ప్రసారం చేస్తే వారే నష్టపోతారని చెప్పడానికి అదే ఒక ఉదాహరణ. 

ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా రాష్ట్రంలోకి ప్రవేశించింది తప్ప స్థానికంగా పుట్టలేదు. కరోనా గాలి ద్వారా వ్యాపించదు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెసిలితేనే కరోనా సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రంలో 59 మందికి కరోనా సోకినప్పటికీ ఇప్పటి వరకు ఎవరికీ సీరియస్ అవలేదు. ఆసుపత్రిలో చేరిన అందరూ కొలుకొంటున్నారు. అయితే కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తచర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భారీగా చర్యలు  చేపట్టింది. ఈ క్వారంటైన్‌ సెంటరు ఏర్పాటు కూడా వాటిలో ఒకటి. దీనిలో ఒకేసారి 1500 మందిని క్వారంటైన్‌లో ఉంచవచ్చు. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నవారు 14 రోజులు ఓపికగా ఉంటే వారి కుటుంబ సభ్యులకు, బందుమిత్రులకు, సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు,” అని అన్నారు. 


Related Post