ఆపత్సమయంలో కేసీఆర్‌ మానవతావాదం

March 28, 2020


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ సగటు రాజకీయనాయకులకు, ముఖ్యమంత్రులకు పూర్తి భిన్నమైన వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రం కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకొని లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోవడంతో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో వివిద జిల్లాలకు వలస వచ్చిన కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్దులు, ఉద్యోగులు అందరినీ సొంత బిడ్డల్లా చూసుకొంటామని అన్నారు. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలలో ఉంటున్నవారిని, రోడ్లపై నివసిస్తున్నవారిని, బిచ్చగాళ్లను కూడా పస్తులు ఉండనీయమని, అందరికీ రెండుపూట్ల కడుపులు నింపుతామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ వచ్చిన విద్యార్దులు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరూ కూడా హాస్టల్స్ ఖాళీ చేయవలసిన అవసరంలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరి బాగోగులు చూసుకొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అందరికీ ఏ లోటు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడివారు అక్కడే ఉండిపోతేనే కరోనాను కట్టడి చేయగలమని కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అమెరికా, ఇటలీ, స్వీడన్ దేశాల కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారు. 

సిఎం కేసీఆర్‌ మనుషుల గురించే కాకుండా రాష్ట్రంలో పశువుల గురించి కూడా ఆలోచించడం ఆయనలో మానవత్వానికి అద్ధం పడుతోంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మనకు రోజూ అవసరమైన పాలను అందిస్తున్న మన పశువులను కూడా కాపాడుకోవలసిన అవసరం ఉంది. వాటికి నిరంతరంగా గడ్డి సరఫరా జరుగుతూనే ఉండాలి. కనుక పశువులకు అవసరమైన ఆహారం, గడ్డి, మందులు వగైరాలు సరఫరా చేసేవారు ఎటువంటి ఆటంకం లేకుండా యాధావిధిగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల దాణాను తీసుకువచ్చే వాహనాలకు ప్రత్యేక అనుమతులు ఇస్తాం. వాటిని అడ్డుకోవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post