హైదరాబాద్‌ చేరుకొన్న పారామిలటరీ దళాలు

March 28, 2020


img

ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు ఏదో ఓ కారణంతో రోడ్లపైకి వస్తుండటంతో దేశంలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొత్తగా 10 కరోనా కేసులు నమోదు అవడంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 59కి చేరుకొంది. 

దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ క్వారంటైన్‌ పాటించకపోతే కరోనా మహమ్మారి విజృంభిస్తుందని అప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేని నిస్సహాయస్థితి ఏర్పడుతుందని కనుక ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించకుంటే ఆర్మీని రంగంలో దించుతామని, అవసరమైతే కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేయడానికి కూడా వెనుకాడబోమని సిఎం కేసీఆర్‌ ఇదివరకే హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు కూడా కటినంగా వ్యవహరిస్తుండటంతో రోడ్లపై ప్రజలరాకపోకలు బాగా తగ్గాయి. అయినప్పటికీ రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కనుక ఒకవైపు కరోనాను ఎదుర్కోవడానికి సకల సన్నాహాలు చేస్తూనే మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకుగాను అన్ని రాష్ట్రాలలో మరింత కటినంగా లాక్‌డౌన్‌ అమలుచేసేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి. బహుశః అందుకే బారీ సంఖ్యలో పారామిలటరీ దళాలు రాష్ట్రాలకు చేరుకొంటున్నాయని భావించవచ్చు. 

కర్ణాటకలోని బీదర్ నుంచి 80 వాహనాలలో పారామిలటరీ దళాలు శుక్రవారం హైదరాబాద్‌ చేరుకొన్నాయి. అయితే పారా మిలటరీ దళాలను పంపించాలని తాము కేంద్రాన్ని కోరలేదని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు. పారా మిలటరీ దళాలు నిత్యం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలి వెళుతుంటూనే ఉంటాయని, ఆవిధంగానే వారు రాష్ట్రానికి చేరుకున్నారు తప్ప వారిని వినియోగించుకోవడానికి పిలవలేదని చెప్పారు. కానీ ప్రజలను ఇళ్ళకే పరిమితం చేయాలంటే ఏదో ఓ రోజు పారామిలటరీ దళాలను కూడా రంగంలోకి దించక తప్పదు కనుక ముందు జాగ్రత్త చర్యలలోనే వారిని పంపించి ఉండవచ్చు. 


Related Post