మిలటరీని దించే పరిస్థితులు తెచ్చుకోవద్దు: కేసీఆర్‌

March 24, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో సిఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారందరూ కొలుకొంటున్నారు. వచ్చే నెల 7వ తేదీనా అందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరో 114 మంది కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచాము. విదేశాల నుంచి వచ్చిన మరో 19,313 మందిపై నిరంతరం నిఘా పెట్టి వారు బయట తిరగకుండా కట్టడి చేసి ఉంచాము. ఒకవేళ వారు బయట తిరుగుతున్నట్లు గుర్తిస్తే కటిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము. మళ్ళీ జీవితంలో విదేశాలకు వెళ్లకుండా వారి పాసుపోర్టులను రద్దు చేస్తాము.   

కరోనా వ్యాప్తి అడ్డుకొని ప్రజల ప్రాణాలు కాపాడటానికే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాము తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రజలు గ్రహించాలి. లాక్‌డౌన్‌ వలన ప్రభుత్వానికి రోజూ కోట్లరూపాయలు నష్టం వస్తున్నా ప్రజల కోసం దానిని భరిస్తున్నాము. కనుక లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు రాష్ట్రమంతటా కర్ఫ్యూ విధిస్తున్నాము. కనుక ఆ సమయంలో ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దు. ఒకవేళ అత్యవసర వైద్య చికిత్స లేదా ఎవరైనా బందువులు చనిపోయినా ఇంకేమైనా అత్యవసరమైనప్పుడు డయల్ 100కు ఫోన్‌ చేసి చెప్పినట్లయితే పోలీసులే మీ ఇంటికి వచ్చి  వాహనంలో తీసుకువెళతారు. 

పగటిపూట బయట తిరిగేందుకు అనుమతిస్తున్నామని చెప్పి ప్రజలు వాహనాలు వేసుకొని ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగితే కటినచర్యలు తీసుకొంటాము. మీరుంటున్న ప్రాంతం నుంచి 3 కిమీ పరిధిలోనే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసుకొనేందుకు వెసులుబాటు ఉంది కనుక అంతకు మించి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కాదని ప్రజలు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగితే అమెరికాలో లాగా మిలట్రీని దింపి కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేయవలసి వస్తుంది. కనుక ప్రజలు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. 

సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ మొదలవుతుంది కనుక కూరగాయలు, కిరాణా దుకాణాలు అన్ని సాయంత్రం 6 గంటలకే తప్పనిసరిగా మూసివేయాలి. లేకుంటే దుకాణాల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాము. అలాగే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధరలు పెంచి బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యాపారులపై కటిన చర్యలు తీసుకొంటాము. లైసెన్సులు రద్దు చేయడమే కాక జైలుకు పంపిస్తాము. కనుక వ్యాపారులందరూ తమ జీవితాలను, వ్యాపారాలను చేజేతులా నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాను.  



Related Post