ప్రజలు రోడ్లపైకి రాకుండా చేయాలంటే...

March 24, 2020


img

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశమంతా ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. కానీ నిత్యావసర సరుకులు తెచ్చుకొనేందుకు, ఆసుపత్రులకు వెళ్ళేందుకు, మందులు కొనుగోలు చేసేందుకుగాను లాక్‌డౌన్‌ సమయంలో కూడా పరిమిత సంఖ్యలో ప్రజలను రోడ్లపైకి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకొని అనేకమంది ప్రజలు వాహనాలు వేసుకొని రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పోలీసులు ఎంతగా నచ్చ చెప్పుతున్నప్పటికీ ఏవో కుంటిసాకులు చెపుతూ రోడ్లపై వాహనాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. సోమవారం ఒక్కరోజే గ్రేటర్ పరిధిలో పోలీసులు 1,255 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సోమవారం ఉదయం నుంచి యధాప్రకారం జనాలు రోడ్లపైకి వచ్చేశారు. అలాగే అన్ని దుకాణాలు తెరుచుకొన్నాయి. దాంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయించారు. ఇకపై లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి వాహనాలు వేసుకొని వస్తే కటినచర్యలు, జరిమానాలు తప్పవని గట్టిగా హెచ్చరించి విడిచిపెట్టారు. అయినప్పటికీ ప్రజలు ఇంకా వాహనాలు వేసుకొని రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. కనుక నేటి నుంచి ఇంకా కటినంగా వ్యవహరించే అవకాశం ఉంది. రోడ్లపై తిరిగే వాహనాలకు భారీగా జరిమానాలు విధించాలని పోలీస్ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ప్రజలు రోడ్లపైకి రాకుండా చేయాలంటే అంతకంటే సులువైన పరిష్కారం సూచిస్తున్నారు పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను కూడా పరిమితం చేసినట్లయితే రోడ్లపైకి వాహనాలు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు తెరిచి ఉంచినట్లయితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద నగదురహిత చెల్లింపులు మాత్రమే చేయగలిగితే ఇంకా కట్టడి చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే అన్ని పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను మోహరించడం వలన కూడా సత్ఫలితాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 

పెట్రోల్, డీజిల్ నిత్యావసరవస్తువుల జాబితాలో ఉంది కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు  తీవ్ర ఆర్ధికనష్టాన్ని భరిస్తున్నప్పటికీ లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. కానీ కానీ దేశానికి కరోనా ప్రమాదంలో ఉన్నా ప్రజలు బాధ్యతారాహిత్యంగా రోడ్లపై తిరుగుతుండటం చాలా శోచనీయం. కనుక ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేయాలంటే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించక తప్పదేమో? రష్యాలో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం పులులు, సింహాలను రోడ్లపై విడిచిపెట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదు. మనదేశంలో అటువంటి దుస్సాహసాలు చేయలేము కనుక పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించడమే మంచిదేమో?


Related Post