ఎర్రగడ్డలో ప్రజలు కూరగాయలు లూటీ!

March 23, 2020


img

ఈరోజు హైదరాబాద్‌ ఎర్రగడ్డ కూరల మార్కెట్‌లో జరిగిన ఓ అనూహ్యపరిణామం చూస్తే రానున్న రోజులలో దేశంలో ఏర్పడబోయే పరిస్థితులకు తొలి సంకేతంలా కనిపిస్తుంది. రోజూలాగే ఈరోజు ఉదయం కూడా ప్రజలు కూరగాయలు కొనుకొన్నేందుకు ఎర్రగడ్డ కూరల మార్కెట్‌కు వచ్చారు. అయితే కరోనా ఆంక్షల ప్రభావం సరుకు రవాణాపై పడటంతో కూరగాయలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక్కరోజు వ్యవధిలో కూరగాయల ధరలు అంతగా పెరిగిపోవడంతో ప్రజలు వ్యాపారులతో వాగ్వాదాలకు దిగారు. చివరికి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో దుకాణాలపై విరుచుకుపడి అందినకాడికి కూరగాయలను సంచులలో నింపుకొని వెళ్ళిపోయారు. ఒకేసారి అంతమంది దుకాణాలపై లూటీ చేయడంతో వ్యాపారులు వారిని అడ్డుకోలేకపోయారు. దాంతో క్షణాలలో మార్కెట్లో కూరలన్నీ ఖాళీ అయిపోయాయి. అది చూసి వ్యాపారులు లబోదిబోమని మొత్తుకున్నారు. తాము ఎంతో వ్యయప్రయాసలకోర్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోలు, వ్యానులలో కూరలు తీసుకువస్తే వియోగదారులు తమ కష్టాన్ని అర్ధం చేసుకోకుండా దోచుకుపోయారని, ఇలాగైతే తాము వ్యాపారం చేయలేమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక్కరోజు జనతా కర్ఫ్యూతో కూరగాయల ధరలు ఆకాశానికి అంటాయి. మరో 9 రోజులవరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉంటుంది. కనుక నిత్యావసరసరుకుల ధరలు ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క సంస్థలన్నీ మూతపడటం వలన వాటిలో పనిచేస్తున్నవారికి ఆదాయం కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతోంది. అంటే ఆదాయం కోల్పోయినప్పుడు, బయట నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే అప్పుడు ఇటువంటి ఘటనలే పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. కనుక సామాన్య ప్రజలు ఆదాయం కోల్పోకుండా అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోకుండా ప్రభుత్వమే అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


Related Post