ప్రధాని మోడీని అవహేళన చేస్తే సహించేది లేదు: కేసీఆర్‌

March 21, 2020


img

సిఎం కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ సూచించిన జనతా కర్ఫ్యూకు మా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఇది మనందరికోసం.. మన దేశం..మన రాష్ట్ర కోసం..మన కుటుంబం...మన పిల్లల కోసం సంకల్పించుకొన్న ఓ గొప్ప కార్యక్రమం. కనుక రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.  

ప్రధాని నరేంద్రమోడీ మరో ప్రతిపాదన కూడా చేశారు. అదేమంటే, “130 కోట్లమంది ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం చాలా గొప్ప విషయం. అదే సమయంలో దేశ వ్యాప్తంగా వేలాదిమంది వైద్యులు, అంబులెన్సు సిబ్బంది, పోలీసులు, పారిశుద్యకార్మికులు ఇంకా అనేకమంది మన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు పనిచేస్తున్నారు. కనుక ఆదివారం సాయంత్రం దేశప్రజలందరూ తమ ఇళ్ళ బాల్కనీలలో నిలబడి చప్పట్లు కొట్టడం లేదా ఏవైనా వస్తువులతో శబ్ధాలు చేయడం ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొందాము. తద్వారా మనమందరం ఒక్కటి అని చాటి చెప్పినట్లవుతుంది. అంతేకాదు..మన సంకల్పం ఎంత గొప్పదో ప్రపంచదేశాలకు చాటి చెప్పినట్లవుతుంది. కనుక ఆదివారం సాయంత్రం దేశ ప్రజలందరూ తమ ఇళ్ళ బాల్కనీలలో నిలబడి చప్పట్లు కొట్టడం లేదా ఏవైనా వస్తువులతో శబ్ధాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. 

కరోనాకు అడ్డుకట్ట వేయడానికి ప్రధాని సూచించిన జనతా కర్ఫ్యూను స్వాగతించిన నెటిజన్లలో కొందరు ఈ చప్పట్లు కొట్టడం, పళ్ళాలతో శబ్ధాలు చేయాలనే ప్రతిపాదనను ఆక్షేపిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిఎం కేసీఆర్‌ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రధాని మోడీ ఒక సదుద్దేశ్యంతో చేసిన విజ్ఞప్తిని అవహేళన చేయడం సరికాదు. దేశప్రజలకు సేవచేస్తున్నవారికి చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవడంలో తప్పేమిటి? రేపు సాయంత్రం నేను నా కుటుంబంతో కలిసి మా ఇంటి బయట నిలబడి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుపుకొంటాము. దేశసమగ్రతను చాటిచెపుతాము. ఈవిషయంలో ఎవరైనా ప్రధాని నరేంద్రమోడీని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే వారిపై కటినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తున్నాను,” అని అన్నారు.


Related Post