రేపటినుంచి శంషాబాద్ విమానాశ్రయం మూసివేత

March 21, 2020


img

విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న యాత్రికుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు రేపటి నుంచి ఈనెల 29వరకు అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానసేవలను నిలిపివేయబడుతున్నాయి. కనుక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా రేపటి నుంచి ఈనెల 29వరకు మూసివేయబడుతుంది. 

రేపు తెలంగాణతో సహా దేశంలో అన్నీ రాష్ట్రాలలో అన్ని బస్సులు, రైళ్ళు, మెట్రో రైళ్ళు, ఎంఎంటిఎస్ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బస్సులు బంద్ చేయబడతాయి.  

ఏపీలో ఈరోజు రాత్రి నుంచే దూరప్రాంతాలకు వెళ్లవలసిన ఆర్టీసీ బస్సులను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ఏపీ రవాణామంత్రి పేర్నినాని తెలిపారు.

కరోనా వైరస్‌కు మందులేదు కనుక అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా రేపు ‘జనతా కర్ఫ్యూ’ పాటిద్దామని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటివరకు రాజకీయపార్టీలు ఏదో సమస్యపై బంద్‌కు పిలుపునివ్వడం దానిని విజయవంతం చేయడానికి ఆ పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి బలవంతంగా దుకాణాలను మూయించడం జరుగుతోంది. కానీ రేపు మొట్టమొదటిసారిగా భారత్‌ ఒక మంచి పని కోసం స్వచ్ఛందంగా బంద్‌ పాటించబోతోంది. కనుక దేశప్రజలందరూ దేశంపట్ల తమ నిబద్దతను చాటుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు.


Related Post