మునుగుతున్న పడవలో ముష్టియుద్ధాలు!

March 21, 2020


img

సముద్రంలో మునుగుతున్న టైటానిక్ షిప్ లేదా అంతరిక్షంలో దెబ్బతిన్న ఓ అంతరిక్షనౌక... అటువంటి సమయంలో కూడా దానిలో ఉన్నవారు ఏదో విషయమై పరస్పరం తిట్టుకొంటూ..కొట్టుకొంటూ ఉంటారు. అది చూసి ప్రేక్షకులు ‘అయ్యో.. ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా మీలో మీరు కొట్టుకొంటారేమిటి?”అని అనుకొంటారు. చాలా ఇంగ్లీష్ సినిమాలలో ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి సన్నివేశాలే కనిపిస్తుండటం విశేషం.

వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి, పార్టీ ఎమ్మెల్యేలందరినీ పోగొట్టుకొన్న తెలంగాణ కాంగ్రెస్‌ ఓ మునుగుతున్న టైటానిక్ నావ అని అందరికీ తెలుసు. మరి ఆ నౌకలో మిగిలిన కాంగ్రెస్‌ నేతలకు ఆ విషయం ఇంకా అర్ధమైందో లేదో తెలియదు కానీ నేటికీ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. 

“తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, రేవంత్‌ రెడ్డి ఇద్దరే పార్టీని నడిపిస్తారా? మేమందరం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలా? రేవంత్‌ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకొని వీధులలోకి వెళ్ళి ఎందుకు పోరాడుతున్నారు? పార్టీ కోర్ కమిటీలో ఏదీ చర్చించకుండా సొంతంగా నిర్ణయాలు ఎందుకు తీసుకొంటున్నారు? ఆయన కార్యక్రమాలకు పార్టీ అనుమతి అవసరం లేదా? ఇది పార్టీ అనుకొంటున్నారా లేక ఆయన సొంత జాగీరు అనుకొంటున్నారా? దీని గురించి కోర్ కమిటీలో నేను అందరినీ నిలదీస్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే పార్టీకి చాలా నష్టం కలుగుతుంది,” అని జగ్గారెడ్డి అన్నారు.


Related Post