జనతా కర్ఫ్యూ పాటిద్దాం... కరోనా వ్యాప్తిని అడ్డుకొందాం

March 20, 2020


img

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఆదివారం దేశప్రజలందరూ ‘జనతా కర్ఫ్యూ’ (స్వీయ గృహ నిర్బందన) పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రధానంగా విదేశాల నుంచే భారత్‌లోకి దిగుమతి అవుతోంది కనుక ఈ ఆదివారం నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానసేవలను కూడా నిలిపివేయబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ నిన్న ప్రకటించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేశారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో ఇప్పటికే జనసమూహం ఎక్కువగా ఉండే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, పార్కులు, ప్రార్ధనా స్థలాలను తాత్కాలికంగా మూసివేశారు.

ఈ ఆదివారం దేశప్రజలందరూ జనతా కర్ఫ్యూ పేరిట ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా సంయమనం పాటించగలిగితే కరోనా వైరస్‌ గొలుసుకట్టు తెగిపోతుందని, తద్వారా వైరస్ వ్యాప్తి నిలిచిపోతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. చైనాలో వూహాన్ నగరంలో కరోనా వైరస్‌ ప్రబలినప్పుడు అక్కడి అధికారులు ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా నిర్బందించి బహిరంగ ప్రదేశాలలో కీటకనాశిని మందులను పిచికారి చేయడం వంటి అనేక చర్యలు చేపట్టడం వలన కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని నిరూపితమైంది. కనుక భారత్‌లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ఆదివారం ఒక్కరోజూ ఇల్లు దాటకుండా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు.

భారత్‌లో కరోనా ఇప్పుడు రెండవ దశలో ఉంది. ఈ దశలోనే రోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవేళ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జనసమూహాలలో తిరిగితే అది 3వ దశకు అంటే...స్థానిక ప్రజల మద్య వ్యాపిస్తుంది. ఒకసారి కరోనా 3వ దశకు చేరుకొన్నట్లయితే ఒకేసారి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతాయి. అప్పుడు దానిని ఆపడం ప్రభుత్వతరం కూడా కాకపోవచ్చు కనుక అది ఇంకా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఒకేసారి వేల సంఖ్యలో వైద్యం అందించడం సాధ్యం కాకపోతే ఇటలీలోలాగ కరోనా మరణాలు వందలు, వేలసంఖ్యలో ఉంటాయి.

భారత్‌లో అటువంటి దుస్థితి రాకూడదనుకుంటే వైద్యులు సూచిస్తున్నట్లు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటూ, వీలైనంతవరకు జనాల మద్యకు వెళ్ళకుండా ఉండాలి. కరోనాకు ఇంకా మందులు కనుగొనలేదు కనుక అది వ్యాపించకుండా అరికట్టడమే మనం చేయగలిగేది. కనుక ఈ ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటిస్తే అందరికీ మంచిది. 


Related Post