నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు

March 20, 2020


img

నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీశారు. అయితే నిర్భయ దోషుల తరపు న్యాయవాది గురువారం అర్ధరాత్రి వరకు డిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తడుతూ వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేయడం విశేషం.

తమ ఉరిశిక్షపై స్టే విధిచాలని కోరుతూ దోషులు పెట్టుకొన్న పిటిషన్‌ను డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు నిన్న సాయంత్రం కొట్టివేయడంతో వారి న్యాయవాది వెంటనే డిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న రాత్రి 11.15 గంటలకు ఆ పిటిషన్‌పై విచారణ జరిపి కొట్టివేసింది. దాంతో దోషుల తరపు న్యాయవాది మళ్ళీ సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్‌. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసి ఉరిశిక్షను అమలుచేయాలని ఆదేశించడంతో నిర్భయ దోషులకు అన్ని మార్గాలు మూసుకుపోయినట్లయింది.

డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు ఆదేశాల ప్రకారం తిహార్ జైలు అధికారులు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు 3వ నెంబరు గదిలో నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీశారు. ఈ ప్రక్రియలో సిబ్బంది, అధికారులు కలిపి మొత్తం 17 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరికొద్ది సేపటిలో జైలు అధికారులు దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. జైలు నిబందనల ప్రకారం లాంచనాలన్నీ పూర్తిచేసిన తరువాత శవాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

దోషుల చేతిలో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ సుమారు రెండువారాలపాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి మృత్యువుతో పోరాడి  చనిపోయింది. దోషులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమె శరీరంలోకి ఇనుపరాడ్డును జొప్పించి హింసిస్తూ పాశవికానందం అనుభవించారు. వారిలో ఒకడు ఆమె కడుపులో ప్రేగులను చేతితో బయటకు లాగాడు. ఆమె ఎంత నరకయాతన అనుభవించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె శరీరంలో అంతర్భాగాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆమెను కాపాడేందుకు భారత్‌, సింగపూర్  వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆమె దయనీయ పరిస్థితి గురించి తెలుసుకొని యావత్ దేశప్రజలు  చలించిపోయారు. చనిపోయే కొద్దిరోజుల ముందు ఆమె తనకు బ్రతకాలని ఉందని చెప్పినప్పుడు తల్లితండ్రులు, వైద్యులతో సహా అందరూ కన్నీరు పెట్టుకున్నారు. 

ఆమెను అంత క్రూరంగా హింసించి ఆమె మరణానికి కారకులైన నలుగురు దోషులు అందుకు ఏనాడూ పశ్చాత్తాప పడలేదు పైగా తాము ఆ నేరం చేయలేదని వాదించారు. ఆఖరి నిమిషం వరకు కూడా కోర్టు తలుపులు తడుతూ  తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆనాడు నిర్భయను దారుణంగా హింసించి ఆమె చావుకు కారణమైనందుకు చివరికి నలుగురూ ఉరి కంబానికి వ్రేలాడక తప్పలేదు.

నిర్భయ రెండు వారాలు నరకయాతన అనుభవిస్తే, వారు ఉరిశిక్షను తప్పించుకునే ప్రయత్నంలో సుమారు ఏడు సంవత్సరాలు తీహార్ జైల్లో అదే యాతన అనుభవించి చనిపోయారు. అది వారి స్వయంకృతాపరాధమేనని చెప్పవచ్చు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయడంపై ఆమె తల్లితండ్రులతో సహా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Related Post