ముందు జాగ్రత్తలే కరోనాకు విరుగుడు: కేసీఆర్‌

March 19, 2020


img

కరోనా వైరస్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న పలుచర్యలను ప్రజలకు వివరించడానికి గురువారం సాయంత్రం సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. “కరోనా వైరస్‌ నివారణకు ఏకైక మార్గం ముందుజాగ్రత్తలు తీసుకోవడమే. అవే మనకు శ్రీరామరక్ష. ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి ద్వారా కూడా కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నందున, రాష్ట్రవ్యాప్తంగా 16 కరోనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాము. ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, జిమ్ సెంటర్లు, పార్కులు, పర్యాటక ఆకర్షణ కేంద్రాలు, గుళ్ళు, ఫంక్షన్ హాల్స్, షాదీఖానాలు, సినిమాహాల్స్ వగైరాలన్నీ మూసివేశాము. అలాగే జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న ఉత్సవాలను, కార్యక్రమాలను కూడా రద్దు చేశాము. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి కనుక అన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటూ ప్రజారవాణా వ్యవస్థను యధాతధంగా నడిపిస్తున్నాము. ప్రజల రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మార్కెట్లు, షాపింగ్ మాల్స్ నడిపించుకోవడానికి అనుమతించాము. సుమారు 5 లక్షల మంది విద్యార్దులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వారందరూ పరీక్షలు వ్రాసేందుకు సిద్దంగా ఉన్నారు కనుక ఇప్పుడు కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేస్తే వారందరూ చాలా నష్టపోతారు. అందుకే పరీక్షా కేంద్రాలలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంటూ పరీక్షలను యధాతధంగా నిర్వహిస్తున్నాము.  

 ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే, కొన్ని రోజులు జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళడం మానుకోండి. బయటకు వెళ్లాల్సివస్తే వైద్యఆరోగ్యశాఖవారు సూచిస్తున్నట్లు అన్ని జాగ్రత్తలు తప్పక పాటించండి. నాకేమవదని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇతరులకు సమస్య సృష్టించకండి. వీలైనంతవరకు ఇంటి పట్టునే ఉండేందుకు ప్రయత్నించండి. ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించండి. ఇటువంటి చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కరోనా వైరస్‌ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారి ద్వారానే దేశంలోకి వస్తోంది కనుక ప్రధాని నరేంద్రమోడీతో జరుగబోయే వీడియో కాన్ఫరెన్సింగ్‌లో అన్ని విదేశాలకు వెళ్ళే, విదేశాల నుంచి వచ్చే అన్ని విమానాలను కొంతకాలం రద్దు చేయమని విజ్ఞప్తి చేస్తాను,” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 


Related Post