ఉత్తమ్‌పై రేవంత్‌ రెడ్డి విమర్శలు

March 19, 2020


img

డ్రోన్ కేసులో అరెస్టయ్యి బెయిల్‌పై బుదవారం సాయంత్రం విడుదలైన కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చి కార్యకర్తలలో ఉత్సాహం నింపితే బాగుండేది. కనీస ఓ ప్రకటన చేసినా బాగుండేది. కానీ చేయలేదు. 

కేటీఆర్‌ ఫాంహౌస్ ముట్టడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చి ఉంటే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చేవారు కానీ ఇవ్వలేదు. కనుక నేను చొరవ తీసుకొని పోరాడి జైలుకు వెళ్ళాను. కనీసం అప్పుడైనా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జైల్లో ఉన్న నన్ను పరామర్శించడానికి రాలేదు. జైల్లో ఉన్న ఖైదీలు కూడా అదే విషయం నన్ను అడిగారు. 

ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ నేతల మద్య పరస్పర అవగాహనలేదనే భావన ప్రజలలో కలిగిస్తున్నాయి. నిజానికి సిఎం కేసీఆర్‌ బలమైన నాయకుడేమీ కాదు. అందరూ కలిసికట్టుగా పోరాడగలిగితే కేసీఆర్‌ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కాంగ్రెస్‌ నేతల అనైఖ్యత ఆయనకు బలంగా మారుతోంది. ఇదివరకు నాయకులు పులుపునిస్తే కార్యకర్తలు వచ్చి పోరాడేవారు కానీ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు నిర్లిప్తత ఆవహించి ఉన్నందున కార్యకర్తలే వారిపై ఒత్తిడి చేయాల్సి ఉంది. పార్టీలో ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా కేసీఆర్‌, కేటీఆర్‌లపై నా పోరాటం ఆపను. తెరాస సర్కార్‌ అవినీతికి సంబందించి కీలకమైన సాక్ష్యాధారాలు గురువారం బయటపెడతాను,” అని అన్నారు.   

కేటీఆర్‌ ఫాంహౌస్ ముట్టడి రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత పోరాటమని, దాని గురించి ఆయన ముందుగా పార్టీలో చర్చించకుండా మొదలుపెట్టారు కనుక ఆయన అరెస్టుతో పార్టీకి సంబందంలేదని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ ముఖ్యనేతలు కూడా అలాగే భావిస్తున్నందున రేవంత్‌ రెడ్డి అరెస్టును ఎవరూ ఖండించలేదనుకోవలసి ఉంటుంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం ఓసారి మొక్కుబడిగా ఖండన ప్రకటన చేశారు. 

కాంగ్రెస్‌ నేతలు పరస్పరం కలహించుకొంటూ, ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నప్పుడు వారు కేసీఆర్‌, కేటీఆర్‌లపై ఏవిధంగా పోరాడగలరు?మన నాయకత్వంపై కార్యకర్తలకు నమ్మకం ఉంటుందా?అని అడుగుతున్న రేవంత్‌ రెడ్డికి ఎవరు సమాధానం చెపుతారు?


Related Post