మరో బాంబు పేల్చిన ఏపీ ఎన్నికల కమీషనర్

March 18, 2020


img

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేసి అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నేడు మరో బాంబు పేల్చారు. ఏపీలో అధికార వైసీపీ నామినేషన్ల ప్రక్రియలో బరితెగించి వ్యవహరించిందని, అధికార యంత్రాంగమంతా ప్రేక్షకపాత్రకు పరిమితం కావడమో లేదా అధికారపార్టీకి వత్తాసు పలకడమో చేస్తోందని కేంద్రహోంశాఖకు నాలుగు పేజీల లేఖ వ్రాశారు. 

ఈ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్ధులను గెలిపించకపోతే పదవులు కోల్పోతారని, తరువాత ఎన్నికలలో టికెట్లు లభించవని ఏపీ సిఎం జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించడంతో వారు బరితెగించి ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఆ కారణంగానే గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని జిల్లాలలో అధికార పార్టీకి అనుకూలంగా భారీగా ఏకగ్రీవాలు అయ్యాయని పేర్కొన్నారు. 

ఎన్నికలలో మద్యం పంచేవారికి మూడేళ్ళు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించాలంటూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన తాజా ఆర్డినెన్స్:2ను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతలు తమ ప్రత్యర్ధుల ఇళ్ళలో బలవంతంగా మద్యం సీసాలను పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులను చేస్తున్నారని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. 

ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినవారికి సహకరించిన జిల్లా కలక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం తన ఆదేశాలను పట్టించుకోలేదని రమేష్ కుమార్ లేఖలో ఫిర్యాదు చేశారు.   

కరోనా వైరస్‌పై కేంద్రప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని ప్రజల భద్రత కోసం ఎన్నికలను 6 వారాలు వాయిదా వేసినందుకు, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తనను నోటికి వచ్చినట్లు దూషించారని, అది చూసి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ కూడా రోజూ నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారని రమేష్ కుమార్ లేఖలో ఫిర్యాదు చేశారు.  

ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రోజూ బెదిరింపులు ఎక్కువైపోయాయని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలవలన తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని, ప్రస్తుత పరిస్థితులలో తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేందుకు భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు.  అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను కాపాడగలరనుకోవడంలేదని   కనుక తమకు కేంద్ర రక్షణదళాలతో భద్రత కల్పించాలని రమేష్ కుమార్ కేంద్రహోంశాఖను కోరారు. ఏపీలో ఎక్కడ ఉన్న తమకు ప్రాణహాని ఉందని భావిస్తున్నానని కనుక హైదరాబాద్‌ నుంచి తాను పనిచేయడానికి అనుమతించాలని కోరారు. 

తాను ఎట్టి పరిస్థితులలో ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కృషి చేస్తానని అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులతో అది ఆసాధ్యమని భావిస్తున్నానని కనుక కేంద్ర భద్రతా దళాలను కేటాయించాలని కోరారు. వీలైనంత త్వరగా తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖను లేఖ ద్వారా కోరారు. 


Related Post