జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

March 18, 2020


img

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్‌ నేపధ్యంలో ఏపీలో జరుగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. దానిపై సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరిస్తూ, ఎన్నికల నిర్వహణలో తాము జోక్యం చేసుకోబోమని, ఈ విషయంలో ఎన్నికల సంఘానికే తుది నిర్ణయం తీసుకోగల అధికారం ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఎన్నికల వాయిదా పడినందున ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత ప్రభుత్వం యధాప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు కానీ ప్రజలను ప్రభావితం చేసే సంక్షేమ పధకాలు అమలుచేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త పధకాలు అమలుచేయాలనుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌ అనుమతి తీసుకోవాలని సూచించింది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించుకోవాలని సూచించింది. 

సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని చెప్పిందే తప్ప యధావిధిగా ఎన్నికలు నిర్వహించమని చెప్పలేదు కనుక జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు తాజా తీర్పు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎన్నికలు వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు తీర్పు పుండుపై కారం చల్లినట్లవుతుంది.


Related Post