కేంద్రానికి రాహుల్‌ గాంధీ హెచ్చరిక

March 17, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తరచూ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటారు కానీ వాటిని పట్టించుకొనేవారే ఉండరు. కానీ ఈరోజు ఆయన చేసిన హెచ్చరికలు చాలా ఆలోచించదగ్గవే. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కరోనా వైరస్‌ ఒక సునామీ వంటిది. అది సృష్టించబోయే ప్రళయం గురించి ఊహించడం చాలా కష్టం. రాగల ఆరు నెలలు దేశానికి చాలా కీలకమైన రోజులు అని నేను భావిస్తున్నాను.కేంద్రప్రభుత్వం దీనిని ఎంత సీరియస్‌గా తీసుకుందో నాకు తెలీదు కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించడంతోనే సరిపోదు. కరోనా వలన దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కనుక కేంద్రప్రభుత్వం ఆ పరిణామాల గురించి ముందే ఆలోచించి ఇప్పటి నుంచే నష్టనివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. లేకుంటే దేశప్రజలు అష్టకష్టాలు అనుభవించవలసి వస్తుంది,” అని హెచ్చరించారు. 

కరోనా భయంతో దేశంలో వ్యాపారసంస్థలు మూతపడుతున్నాయి. దేశంలో మాంసాహారం, పౌల్ట్రీ పరిశ్రమ అన్నిటికంటే ఎక్కువగా నష్టపోతున్నాయి. హోటళ్ళు, షాపింగ్ మాల్స్ మూతపడుతున్నాయి. చివరికి రోడ్లపక్కన వ్యాపారాలు చేసుకొనేవారు సైతం నష్టపోతున్నారు. కరోనా భయంతో ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఒకేసారి అన్ని వ్యవస్థలు నష్టపోతే రాహుల్‌ గాంధీ చెప్పినట్లు రానున్న రోజులలో దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే నష్ట నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. దేశప్రజలు కూడా వృదా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తూ రాబోయే గడ్డుకాలం కోసం సిద్దపడటం మంచిది. 


Related Post