తెలంగాణ ఇచ్చింది ఎక్కువ...వచ్చింది తక్కువ!

March 17, 2020


img

రాష్ట్రాలకు నిధులు కేటాయింపులు, పన్నులలో రాష్ట్రాల వాటా చెల్లింపులపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చేశామని కేంద్రప్రభుత్వం, బిజెపి నేతలు వాదిస్తుంటే, ‘తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది ఎక్కువ...తిరిగి వచ్చింది చాలా తక్కువ’ అని సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. 

నిధుల కేటాయింపు, విడుదలపై గతంలో ఎన్నడూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఇటువంటి వాదోపవాదాలు జరుగలేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో బిజెపి, కొన్ని రాష్ట్రాలలో బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉండటంతో ఈ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలలో నిజానిజాలు తెలుసుకోవడం సామాన్య ప్రజలకు చాలా కష్టమే కనుక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకలు నడవడానికి కారణం కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమా లేదా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా? అనేది తెలుసుకోవడం కూడా కష్టమే. 

ఆర్ధికమంత్రి హరీష్‌రావు నిన్న శాసనమండలిలో ఆర్దిక ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా గత 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళిన నిధులు, అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన నిధుల వివరాలను తెలియజేశారు. 

గడచిన 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో నుంచి వివిద పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్ళిన మొత్తం: రూ. 2,72,926 కోట్లు. 

గడచిన 5 ఏళ్ళలో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు: రూ. 1,12,854 కోట్లు. అంటే గడచిన 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రమే కేంద్రప్రభుత్వానికి రూ.1,60,072 కోట్లు చెల్లించిందని స్పష్టమవుతోంది. 

2019-20లో కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన పన్ను వాటా: రూ. 20,583 కోట్లు కాగా కేంద్రప్రభుత్వం రూ. 15,968 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వివిద పద్దుల క్రింద అంటే గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.313 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.933 కోట్లు, ఐజిఐఎస్‌టి-2,812 కోట్లు, బీఆర్‌జీఎఫ్-రూ.450 కోట్లు కలిపి మొత్తం రూ.4,508 కోట్లు కేంద్రం నుంచి ఇంకా రావలసి ఉందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. 

ఇక 15వ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపును 42 నుంచి 41 శాతాని తగ్గించడంతో తెలంగాణకు రూ.2,384 కోట్లు కోత పడింది. రాష్ట్రానికి మంజూరు అయిన 41 శాతం వాటాలో రూ.723 కోట్లు ఇంతవరకు విడుదల చేయనే లేదు. అంటే అధికారికంగా ఒక శాతం కోత విధించి అనధికారికంగా మరికొంత చెల్లించకుండా నిలిపివేసిందని అర్ధమవుతోంది. 

కనుక తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులకు అది తిరిగి ఇస్తున్న నిధులకు ఎక్కడా పొంతన లేదని, నిధుల విడుదల విషయంలో కేంద్రప్రభుత్వం కనీస న్యాయం కూడా పాటించడం లేదని మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.


Related Post