చెన్నమనేనికి పౌరసత్వం ఎందుకు నిరాకరిస్తున్నట్లు?

March 17, 2020


img

సీఏఏపై బిజెపి, విపక్షాలు భిన్నవాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దానిని తీసుకువచ్చామని కేంద్రప్రభుత్వం, బిజెపి వాదిస్తుంటే, దాని వలన దేశ సమగ్రత, ప్రతిష్ట దెబ్బ తింటున్నాయని దానిని వ్యతిరేకిస్తున్న పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఈ భిన్న వాదనలలో నిజానిజాలు తెలియక దేశప్రజలలో తీవ్ర అయోమయం నెలకొంది. దాంతో తాము అభిమానించే పార్టీల వాదనలనే నిజమని భావిస్తూ సీఏఏకు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఆందోళనలు చేస్తున్నారు. అయితే అధికార, ప్రతిపక్షపార్టీలకు సీఏఏ వలన దేశానికి కలిగే మేలు లేదా కీడు గురించి కంటే, దాని ద్వారా తమ పార్టీలకు రాజకీయ ప్రయోజనం లేదా రాజకీయ మైలేజీ పొందాలనే యావే ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో సీఏఏ అనుకూల, వ్యతిరేకవర్గాలుగా ప్రజలను చీల్చి పోరాడుకొంటున్నాయి. సీఏఏ వలన భారతీయులకు నష్టం జరుగుతుందో లేదో ఇంతవరకు తెలియదు కానీ సీఏఏ పేరుతో జరుగుతున్న ఈ పోరాటాల వలననే దేశ సమగ్రత, ప్రతిష్ట దెబ్బ తింటున్నాయని చెప్పక తప్పదు. డిల్లీలో జరిగిన విధ్వంసం... దానిని అంతర్జాతీయ సమాజం ఆక్షేపించడమే ఇందుకు తాజా నిదర్శనం. కనుక ఇప్పుడు ప్రజలే విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది.   

ఇక సీఏఏను వ్యతిరేకించాడమంటే దేశద్రోహమేనని బిజెపి నేతలు సూత్రీకరించడం ఎంతవరకు సబబో న్యాయస్థానాలు తేలుస్తాయి. పొరుగుదేశాలలో హింసకు గురయ్యి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మైనార్టీలకు మానవతా దృక్పదంతో మన దేశపౌరసత్వం ఇవ్వాలన్నదే సీఏఏ ప్రధాన ఉద్దేశ్యమని, దేశంలో ఉన్నవారిని బయటకు పంపించడానికి కాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ చెప్పారు. పొరుగుదేశాల శరణార్దుల పట్ల అంత మానవతాదృక్పదంతో వ్యవహరించాలనుకొంటున్న కేంద్రప్రభుత్వం తెలంగాణలోనే పుట్టి పెరిగి రాష్ట్రానికి సేవ చేస్తున్న టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పట్ల ఎందుకు అంత కటినంగా వ్యవహరిస్తోంది?అనే ప్రశ్నకు బండి సంజయ్‌ సమాధానం చెపితే బాగుంటుంది. 


Related Post