కరోనాను కూడా వాడేసుకొంటున్నారు

March 16, 2020


img

కరోనా వైరస్‌ పేరు వింటేనే అందరూ భయపడిపోతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం కరోనా వైరస్‌ను కూడా విడిచిపెట్టడం లేదు. దానినీ వాడేసుకొంటున్నారు. కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో, ప్రస్తుతం ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్‌పై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మొదలు మంత్రులు, నేతలు మండిపడుతున్నారు. ఆయనపై సిఎం జగన్ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎన్నికల వాయిదా పడితే తెలుగుదేశం అభ్యర్ధులకు మరికొంత సమయం చిక్కుతుంది కనుక అధికార వైసీపీకి ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కనుక వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతుంటే టిడిపి నేతలు పండగ చేసుకొంటున్నారు.   

ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాధిత్య సింధియా మరో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సిఎం కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకొంది. ఆయన కూడా కరోనా వైరస్‌నే ఆశ్రయించారు. ఈరోజు శాసనసభలో బలపరీక్ష జరుగలవలసి ఉండగా, సిఎం కమల్‌నాథ్ సూచన మేరకు స్పీకర్ ప్రజాపతి కరోనా వైరస్‌ కారణంగా శాసనసభ సమావేశాలను 10 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టేందుకు సిద్దమైన బిజెపి స్పీకర్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దీంతో కరోనా వైరస్‌ వలన కమల్‌నాథ్ ప్రభుత్వానికి మరో 10 రోజులు ఆయువు పెరిగినట్లైంది. 

ఈ అనూహ్య పరిణామంతో షాక్ అయిన మధ్యప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సహా 10 మంది బిజెపి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. గవర్నర్‌ ఆదేశించినప్పటికీ స్పీకర్ కరోనా వైరస్‌ను కుంటిసాకుగా చూపుతూ శాసనసభ సమావేశాలను వాయిదావేసి కమల్‌నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించకుండా తప్పించుకొనేందుకు 10 రోజులు అవకాశం కల్పించారని, కనుక తక్షణం శాసనసభను సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించవలసిందిగా స్పీకర్ ప్రజాపతిని ఆదేశించాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, మంగళవారం వాటిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. కరోనా వైరస్‌ వలన ప్రాణనష్టం ఉంటుందని తెలుసు కానీ రాజకీయాలలో కూడా లాభనష్టాలు ఉంటాయని అర్ధమవుతోంది.


Related Post