సీఏఏను మేము గుడ్డిగా వ్యతిరేకించడం లేదు: కేసీఆర్‌

March 16, 2020


img

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో చివరి రోజైన ఈరోజు సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. దానిపై సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “సీఏఏను మేము గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. దానిని లోతుగా అధ్యయనం చేసి అది మన దేశానికి పనికిరాదని దృవీకరించుకొన్న తరువాతే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాము. ఇప్పటికే దేశంలో డిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ ఘడ్, కేరళ రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలలో తీర్మానాలు చేశాయి. సీఏఏను వ్యతిరేకిస్తు తీర్మానం చేసిన రాష్ట్రాలలో తెలంగాణ 8వదిగా నిలుస్తుంది. 

దేశప్రజలు సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనల ద్వారా కేంద్రానికి తమ నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, దేశప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కేంద్రప్రభుత్వం దానిని బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం రాక్షసానందమే అవుతుంది. ఆరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ డిల్లీలో పర్యటిస్తున్నప్పుడే దీనిపై హింస జరిగింది. దానిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు అంతర్జాతీయనేతలు మనదేశాన్ని తప్పు పడుతూ వేలెత్తి చూపించారు. కనుక ఇది హిందూ, ముస్లింల సమస్య కాదు దేశ సమగ్రత, ప్రతిష్టకు సంబందించిన అంశమని అర్ధమవుతోంది. 

దేశంలో మరే సమస్యలు లేవన్నట్లు కేంద్రప్రభుత్వం దీనిని భుజానికెత్తుకొని ప్రజల నెత్తిన పెట్టడం దేనికి?భిన్న బాషా, సంస్కృతులకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో సీఏఏను అమలుచేయడం సాధ్యం కాదు. సీఏఏ రిజిస్ట్రేషన్ కోసం ఓటరు కార్డు, ఆధార్, రేషన్ కార్డువంటివేవీ పనికిరావని కేంద్రప్రభుత్వం చెపుతోంది. కనుక బర్త్ సర్టిఫికేట్ అవసరం. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన నాకే బర్త్ సర్టిఫికేట్ లేనప్పుడు ఇక దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇప్పటికిప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఏవిధంగా తీసుకురాగలరో కేంద్రప్రభుత్వమే చెప్పాలి. కనుక సీఏఏపై తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని శాసనసభ ద్వారా ఈ తీర్మానం రూపంలో కేంద్రాన్ని కోరుతున్నాము,” అని అన్నారు. 


Related Post