నాకెందుకు రైతుబంధు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

March 16, 2020


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రైతుబంధు పధకం గురించి చెప్పిన మాటలు చాలా ఆలోచించదగ్గవే. “మనలో (శాసనసభ్యులలో) చాలా మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారే కనుక రైతుల సమస్యలు మనందరికీ తెలుసు. రాష్ట్రంలో నిరుపేద రైతులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పధకం ప్రవేశపెట్టడం చాలా సంతోషం. అయితే అది నిజంగా అవసరమున్న పేద రైతులకు మాత్రమే అందిస్తే బాగుంటుంది. రైతుబంధు పధకం కింద నా ఖాతాలో రూ.3 లక్షలు జమా అయ్యాయి. కానీ రైతుబంధు అవసరం లేని మనవంటివారికి కూడా పేదరైతులతో సమానంగా ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుండటం సరికాదని నేను భావిస్తున్నాను. కనుక ప్రభుత్వం రైతుబంధు పధకం కేవలం పేదరైతులకు మాత్రమే వర్తింపజేసి వారికి అవసరమైనంతా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేదరైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పధకం ప్రవేశపెట్టినప్పుడు, కోట్లు ఆర్జిస్తున్న రాజకీయ నాయకులకు, భూస్వాములకు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారలకు ఎందుకు ఇస్తోంది? వారికి కూడా రైతుబంధు పధకాన్ని వర్తింపజేసి దానిని వదులుకోమని వారిని బ్రతిమలాడుకోవలసిన అవసరం ఏమిటి? రైతుబంధు పధకం నిజంగా చాలా అవసరమున్న కౌలు రైతులకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, పేద రైతులతో సమానంగా రాష్ట్రంలో కోటీశ్వరులుకు, భూస్వాములకు రైతుబంధు ఎందుకు ఇస్తోంది? తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెంచుకొని సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయలేక విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు?


Related Post