జగన్ సర్కారుకు ఎన్నికల కమీషనర్ షాక్

March 16, 2020


img

జగన్ సర్కారుకు ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్ పెద్ద షాక్ ఇచ్చారు. కరోనా వైరస్‌ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అల్లర్లను చాలా తీవ్రంగా పరిగణిస్తూ, చిత్తూరు, గుంటూరు కలక్టర్లను బదిలీ చేశారు. 

తిరుపతి అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీలను కూడా బదిలీ చేశారు. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, మాచర్ల సీఐతో సహా మరో నలుగురిని తక్షణం సప్సెండ్ చేయాల్సిందిగా పోలీస్ డీజీపీని ఆదేశించారు. ప్రతిపక్ష అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బాధ్యులపై కటినచర్యలు తప్పవని హెచ్చరించారు. 

కేంద్రప్రభుత్వం కరోనా వైరస్‌ను విపత్తుగా ప్రకటించింది కనుక జాతీయస్థాయి అధికారులతో చర్చించిన తరువాత ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో వేలాదిమంది ప్రజలు గుమిగూడితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కనుకనే ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశామని చెప్పారు. కనుక కేంద్రప్రభుత్వం కరోనా వైరస్‌పై విపత్తు హెచ్చరికను ఉపసంహరించుకోగానే మళ్ళీ ఎన్నికల ప్రక్రియ చేపడతామని రమేష్ కుమార్ చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తదుపరి ప్రక్రియ మొదలుపెడతామని కనుక పార్టీలు, అభ్యర్ధులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు.   

 ఈనెల 23న మునిసిపల్ ఎన్నికలు, మార్చి 27, 29 తేదీలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈదశలో ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్ ఎన్నికలను 6 వారాలు వాయిదా వేయడం, కలక్టర్లను, ఎస్పీలను బదిలీలు చేయడం, , సీఐలను సస్పెన్షన్ చేయడాన్ని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబునాయుడు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు హయాంలో తన సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్‌ను ఆ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా ఇప్పుడు ఈవిధంగా రుణం తీర్చుకొంటున్నారని జగన్, విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఘనుడని దీంతో మరోసారి నిరూపించారని వారు ఆరోపించారు. 

ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తన పరిధిని అతిక్రమించి ముఖ్యమంత్రిలాగ వ్యవహరిస్తున్నారని, అటువంటప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి ఏం ప్రయోజనమని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రమేష్ కుమార్ కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయనపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని, ఆయన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించగానే సిఎం కేసీఆర్‌ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.


Related Post