మల్కాజగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మిగిలిన ఇద్దరు ఎంపీలు పెద్దగా స్పందించలేదు కానీ తమిళనాడుకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి స్పందించడం విశేషం. తమిళనాడులో కరూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ఆమెకు తెలియడంతో వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ వ్రాశారు. ఒక ఎంపీ అయిన రేవంత్ రెడ్డిపై రాజకీయ కక్షసాధింపుతోనే డ్రోన్ కేసులో అరెస్ట్ చేసి బెయిల్‌పై రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోంటోందని, ఒక ఎంపీ పట్ల ఈవిధంగా వ్యవహరించడం సరికాదని, కనుక తక్షణం రేవంత్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయించాలని ఆమె స్పీకరును కోరారు.
రేవంత్ రెడ్డి అరెస్టుపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించిన తీరుకు, తమిళనాడు ఎంపీ జ్యోతిమణి స్పందించిన తీరుకు ఎంతో తేడా ఉంది. సాటి కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యి జైలులో ఉంటే అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని జగ్గారెడ్డి అనగా, రేవంత్ రెడ్డిని జోతిమణి ఎన్నడూ చూడనప్పటికీ సాటి కాంగ్రెస్ ఎంపీ గనుక ఆయన తరపున స్పీకరును అభ్యర్ధించారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈవిధంగా స్పీకరును కోరలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మద్య ఎంత దూరం ఉందో ఇది తెలియజేస్తోంది.