రజనీ సేఫ్ గేమ్ ఆడాలనుకొంటున్నారా?

March 13, 2020


img

ప్రముఖ కోలీవుడ్ నటుడు రజనీకాంత్‌ తాను రాజకీయాలలో వస్తాను కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోనని చెప్పడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌ ఒక సరికొత్త రాజకీయ ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడగా, సినీ గ్లామరుతో రాజకీయాలలో ప్రవేశించి అధికారం చేపట్టాలని భంగపడిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, కమల్‌ హాసన్‌లాగ తాను కూడా భంగపడటం ఇష్టంలేక రజనీకాంత్‌ ముందుగానే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టబోనని చెపుతున్నారని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

జయలలిత ఆకస్మిక మరణం తరువాత రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడు రజనీకాంత్‌ రాజకీయాలలో ప్రవేశించి ఉండి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేది కానీ ఇప్పుడు ఆయన సహనటుడు కమల్‌హాసన్ కూడా సొంత కుంపటి పెట్టుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు, రజనీ రాజకీయ ప్రవేశం వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదని ఆ విషయం ఆయన కూడా గ్రహించారని, కానీ అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక అయిష్టంగా రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారని, అందుకే ఆయన ఈవిధంగా అని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

రజనీకాంత్‌ సేఫ్ జోన్‌గా భావించే సినీరంగంలో ఉన్నారని, దానిని వదులుకొని రాజకీయాలలోకి రావడానికి ఆయన భయపడుతున్నారని అందుకే ‘పార్టీ పెడతా..కానీ పదవులు చేపట్టనని’ ముందే షరతులు ప్రకటిస్తూ తన రాజకీయ ప్రవేశం ప్రతిపాదనను అటకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రజనీకాంత్‌ పార్టీ పెట్టడం ఖాయం.. ఆయన మినహా పార్టీ అభ్యర్ధులు ఎన్నికలలో పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.


Related Post