పార్టీ కంటే పదవులే ముఖ్యమా?

March 13, 2020


img

చెట్టు ఉంటేనే నీడ..కానీ చెట్టే లేకపోతే? అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆలోచిస్తున్నట్లు లేదు. పార్టీలో ముఖ్యనేతలు పిసిసి అధ్యక్ష పదవి సంపాదించుకొని తమ రాజకీయ జీవితంలో మరోమెట్టు పైకి ఎదగాలనుకొంటున్నారే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి పట్టించుకొంటున్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేనే ఎప్పటికైనా తమకు పదవులు...అధికారం లభిస్తుందనే విషయం గ్రహించనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎవరికివారు పదవుల కోసం లాబీయింగ్ చేసుకొంటున్నారు. రాజకీయ పార్టీలలో ఇది చాలా సహజమే కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది మరికాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే, ప్రాంతీయ పార్టీలలోలాగ ఆ పార్టీ నేతలు ఎవరూ ఎవరికీ విధేయంగా అణిగిమణిగి ఉండనక్కరలేదు. కనుక పార్టీలో అందరూ ఎవరికివారే అన్నట్లుంటారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి 111 జీవోపై చేస్తున్న పోరాటం ఆయన వ్యక్తిగతమని, పార్టీలో ఎవరికి వారే ‘తోపులు’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన మాటలే అందుకు తాజా ఉదాహరణ. కనుక కాంగ్రెస్‌ పార్టీలో నేతలు పార్టీ ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్ధమవుతోంది. 

పార్టీ అధికారంలో లేనప్పుడు నేతలు మరింత బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా, సమన్వయంతో వ్యవహరించవలసి ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాని వలన నష్టపోయేది తామేనని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ అయోమయం, ఈ బలహీనతలే టిఆర్ఎస్‌, బిజెపిలకు బలంగా మారాయి. ప్రజలలో విశ్వసనీయత కోల్పోయేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్‌ నేతలు మూస రాజకీయాలు చేయడం మానుకోకపోతే వారే నష్టపోతారని సిఎం కేసీఆర్‌ కూడా హెచ్చరిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ నేతల తీరు మారడం లేదు.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వారు ఇదేవిధంగా టికెట్లు, పిసిసి అధ్యక్ష పదవి కోసం కీచులాడుకొంటూ అధికారాన్ని చేజార్చుకున్న సంగతి మరిచిపోయి మళ్ళీ ఇప్పుడు పార్టీ పరిస్థితిని పట్టించుకోకుండా పిసిసి అధ్యక్ష పదవి కోసం బహిరంగంగా కీచులాడుకొంటున్నారు. తమలో తమకే సఖ్యత, పరస్పర అవగాహన లేనప్పుడు ప్రజలు తమను ఎందుకు నమ్మాలని కాంగ్రెస్‌ నేతలు ఆలోచించాలి.


Related Post