కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకొంటున్నారా?

March 13, 2020


img

టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అప్పుడప్పుడు సిఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలని, దేశప్రజలు కేసీఆర్‌ నాయకత్వం కోరుకొంటున్నారంటూ తమ పార్టీ అభిప్రాయాలను ప్రజాభిప్రాయలుగా చెపుతుంటారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలలో చాలా మందికి దక్షిణాది రాష్ట్రాల పేర్లు కూడా తెలియవనే సంగతి టిఆర్ఎస్‌ నేతలకు తెలిసి ఉండకపోవచ్చు. పైగా దక్షిణాది రాష్ట్రాల పార్టీలను ఉత్తరాది పార్టీలు  అవసరమైతే వాడుకొంటాయి కానీ వాటి నాయకత్వాన్ని అంగీకరించవని వారికి తెలిసే ఉండాలి. అపర చాణక్యుడిగా పేరొందిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే అంగీకరించకపోవడం అందుకు చక్కటి నిదర్శనం. 

ఇక ఎంపీల సంఖ్యను బట్టి చూసినా ఉత్తరాది రాష్ట్రాలదే పైచెయ్యిగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎంపీలను అందించగల ఉత్తరాది రాష్ట్రాలలోనే అనేకమంది ప్రధానమంత్రి పదవి కోసం పోటీలు పడుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాలు ఉండగా, కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి దేశప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకొంటున్నారని టిఆర్ఎస్‌ నేతలు పదేపదే చెప్పుకోవడం వలన వారే నవ్వులపాలవుతారు. 

నిజమే...సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 5 ఏళ్ళలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలిపారు. కానీ ప్రధాని పదవి చేపట్టేందుకు అదొక్కటే సరిపోదు. పైన చెప్పుకొన్న లెక్కలన్నీ సరిచేయగలిగినప్పుడే సాధ్యం అవుతుంది. 

అయితే గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు కదా? అని సందేహం కలుగవచ్చు. నరేంద్రమోడీ ఉత్తరాది రాష్ట్రాలలో బలంగా ఉన్న జాతీయపార్టీ బిజెపికి చెందినవారు కావడం...ఆయనను ఉత్తరాదినేతగా ప్రజలు భావిస్తుండటం...ఆ సమయంలో బిజెపి నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుండటం, నరేంద్రమోడీ శక్తియుక్తులు, నాయకత్వ లక్షణాలు, సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు దేశప్రజలు కాంగ్రెస్‌ పార్టీ పట్ల విసిగిపోయుండటం వంటి అనేక కారణాలు నరేంద్రమోడీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కల్పించాయని అందరికీ తెలుసు. కనుక దేశరాజకీయాలలో ఏవైనా అనూహ్యపరిణామాలు జరిగినప్పుడే దక్షిణాదినేతలకు అటువంటి అవకాశం లభిస్తుంది తప్ప ఎంతగా పోరాడినా లభించడం కష్టమేనని చెప్పకతప్పదు. 

ఇక సీఏఏ, ఎన్ఆర్సీలపై పోరాడవలసి వస్తే అది సిఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమవుతుందని గువ్వల బాలరాజు అన్నారు. నిజమే..కానీ వాటిపై పోరాటం ప్రారంభించడమంటే చేజేతులా రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టించుకోవడానికి సిద్దపడటమేనని డిల్లీ అల్లర్లతో రుజువు అయ్యింది. కనుక రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఏవిధంగా పోరాడవచ్చో టిఆర్ఎస్‌ నేతలే చెప్పాలి.


Related Post