కేంద్రం తీరు మారాలి: సిఎం కేసీఆర్‌

March 12, 2020


img

రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తప్పుడు లెక్కలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాని తాత అయిపోయింది. 

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా కేంద్రానికి సుమారు రూ.50,000 కోట్లు పన్నులు వెళుతుంటే అందులో సగం కూడా తిరిగి ఇవ్వదు. అదికూడా మన మంత్రులు, ఎంపీలు, అధికారులు వందసార్లు డిల్లీలో పెద్దల చుట్టూ తిరిగితేనే విడుదలవుతుంది లేకుంటే కష్టమే. నిధుల కోసం పూర్తిగా కేంద్రప్రభుత్వం మీద ఆధారపడితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అవుతుంది. కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేసినా చేయకపోయినా మేము మాత్రం టంచనుగా 1వ తారీకున ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించి, ఆ తరువాతే ఇతర ఖర్చుల గురించి ఆలోచిస్తాము. అది మా బాధ్యత కూడా. 

పన్నులలో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం అంటే ఏదో బిచ్చం వేస్తున్నట్లు కేంద్రం భావిస్తుంటుంది. కానీ అది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న హక్కు అని గుర్తించడం లేదు. ఆనాడు కాంగ్రెస్‌ వైఖరితో విసిగివేసారిపోయున్న దేశప్రజలు దానికి ప్రత్యామ్నాయంగా బిజెపి కనబడింది కనుకనే దానిని ఎన్నుకున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా దేశప్రజలను మభ్యపెట్టేదో ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదేవిధంగా మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తోంది. కేంద్రం తీరు మారాల్సిన అవసరం ఉంది. 

తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వారిని పదేపదే తిరస్కరిస్తున్నారు. అయినా వారి తీరు మారడం లేదు. అది వారి ఖర్మ అనుకోని సరిపెట్టుకోవాలి,” అని అన్నారు.


Related Post